ఒకపక్క తెలంగాణలో అసెంబ్లీ ఉప ఎన్నికల వేడి రగులుతుండగానే , మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నాయకులు మధ్య గ్రూపు రాజకీయాలు మరింత పెరిగాయి.ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ సొంత పార్టీనీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు.
అంతా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ విమర్శలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీ సైతం అసంతృప్త నాయకులను ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపునిచ్చినా, ఆ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకాలేదు.
అంతేకాదు మునుగోడు అసెంబ్లీ ఒక ఎన్నికల ప్రచారానికి తాను వచ్చేదే లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డిని తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి సారధ్యంలోనే కాంగ్రెస్ ముందుకు వెళ్తే పార్టీ చచ్చిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించడంతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ను ఇన్చార్జి బాధ్యతలను తప్పించి, ఆస్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ను నియమించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.ఏఐసిసి సమావేశానికి తాను ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ సోనియాగాంధీకి వెంకటరెడ్డి లేఖ రాశారు.

తనను పార్టీలో ఎవరు ఏ విధంగా అవమానిస్తున్నారనే విషయాన్ని వెంకటరెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.తనను తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, చుండూరులో నిర్వహించిన సభ గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, తనకు తెలియకుండానే సభను నిర్వహించారని , అలాగే పార్టీలో చేరికల విషయమై తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనూ తనకు చెప్పకుండానే చేర్చుకోవడం పైన వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.పార్టీలోని నాయకులందరి అభిప్రాయాలను మరోసారి తీసుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని మార్చాల్సిన అవసరం ఉందని వెంకటరెడ్డి అధిష్టానానికి వినతి తో కూడిన హెచ్చరికలు చేస్తున్నారు.







