చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా సీనియర్ నాయకులు తమ అసంతృప్తిని బయటపెడుతూ, పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం, అలాగే పార్టీలోని నేతలపైనా మీడియా ముఖంగా విమర్శలు చేయడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎప్పుడూ కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి ఉంటున్నా, ఇప్పుడు మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని నిలబెట్టడం పార్టీని ఈ ఉప ఎన్నికల్లో గెలిపించడం వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా గ్రూపు రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్య ఇస్తూ ఉండడం , కొంతమంది పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతుండడం వంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి కొంతమంది సీనియర్ నాయకులకు పిలుపు అందింది.
వారందరినీ ఎల్లుండి ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది.తెలంగాణలోని ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలకు పిలుపు వచ్చింది .నేరుగా ఫోన్ చేసి మరి ఢిల్లీకి రావాల్సిందిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు బట్టి విక్రమార్క వంటి నాయకులకు ఆహ్వానం అందింది.కొద్దిరోజులుగా భవనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , మర్రి శశిధర్ రెడ్డి వంటి వారు అసహనం వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు.

అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాణిక్యం ఠాకూర్ పైన విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పుడు అసంతృప్త నాయకులను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలవడం ఆసక్తికరంగా మారింది. ఒకపక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనేక విమర్శలు చేస్తూ ఉండడం వంటి విషయాలపైనే అధిష్టానం క్లాస్ పీకేందుకు అందర్నీ ఢిల్లీకి పిలిపించినట్లుగా తెలుస్తోంది.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరిని నిలబెట్టాలి ? ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి ? ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్చించబోతోందట.







