సూర్యాపేట జిల్లా:వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలియని మూర్ఖుడు బండి సంజయ్ అని,కమ్యూనిస్టుల త్యాగాలను అవహేళన చేస్తూ మాట్లాడిన బండి సంజయ్ పోరాటయోధులకు క్షమాపణ చెప్పాలని,కమ్యూనిస్టులను విమర్శించి నైతిక అర్హత లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి ఆరోపించారు.శనివారం నూతనకల్ మండల పరిధిలోని శిల్పకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏ చరిత్ర లేని బీజేపీకి స్వాతంత్ర పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
దేశంలో కలిసి ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతూ రాజకీయ పబ్బం గడుపుతుందని ఎద్దేవా చేశారు.ఓవైపు స్వదేశీ జపం చేస్తూ దేశ భక్తి ముసుగులో జాతి సంపద విదేశీ బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు దొచి పెట్టడం దారుణమన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్,నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు.రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు తీసేయడం బిజెపికే చెల్లిందన్నారు.
బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని,అధికార దాహంతో తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని,ఎర్రజెండాను,కమ్యూనిస్టులను విమర్శిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు,మట్టిపెళ్లి సైదులు, కందాల శంకర్ రెడ్డి,దండ వెంకటరెడ్డి,పులుసు సత్యం,బుర్ర శ్రీనివాస్,మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి,కొప్పుల రజిత,మేకనబోయిన సైదమ్మ,మద్దెల జ్యోతి,నాయకులు గుమ్మడవెల్లి ఉప్పలయ్య,పల్ల సుదర్శన్,బొజ్జ శ్రీనివాస్,పులుసు ప్రహ్లాద,అల్లిపురం సంజీవరెడ్డి,తొట్ల అచ్చయ్య,ఎర్ర ఉప్పల్ రెడ్డి,సామ వెంకట్ రెడ్డి,తొట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.