తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొనడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు బిజీ బిజీగా ఉన్నారు.ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతుండడంతో బిజెపి, కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీలు అప్పుడే ఎన్నికల సమరం లో కి వెళ్ళిపోయాయి.
ఇంకా పార్టీ అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాకపోయినా హడావుడి మాత్రం చేస్తూ, గ్రామాలు, మండలాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి గడపకు వెళ్తూ తమ పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.మూడు ప్రధాన పార్టీలు మునుగోడులో తమ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా , బిజెపి, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల గెలుపునకు బాటలు వేసుకోవాలని చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు టిఆర్ఎస్, బీజేపీలు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టడం కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెంచుతుంది.
మునుగోడు ఉప ఎన్నికలకు ముందే అన్ని రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టాయి.ఈ నియోజకవర్గంలో కీలక నాయకుల అనుకున్న వారందరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా, తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నాయి.టిఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలని బిజెపి ప్రయత్నిస్తుండగా, బీజేపీ కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, కాంగ్రెస్ టిఆర్ఎస్ లు పార్టీలోకి చేరికలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రధానంగా కాంగ్రెస్ ను బలహీనం చేసి ఈ నియోజకవర్గంలో గెలవాలని బిజెపి , టిఆర్ఎస్ లు ప్రయత్నాలు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ఉదృతం చేశాయి.తమ పార్టీలోకి చేరితే భవిష్యత్తులో ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామనే విషయాన్ని చెబుతూ కాంగ్రెస్ నుంచి నాయకులను చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి.అంతే కాకుండా రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో, పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా బిజెపి ప్లాన్ చేసుకుంది.ప్రతి గ్రామం నుంచి చేరికలు ఉండేలా బిజెపి ప్లాన్ చేసుకుంది.
అయితే ఎవరెవరు పార్టీ మారుతున్నారనే విషయం బయటకు రాకుండా, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటెల రాజేందర్ మునుగోడు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి నాయకులను పార్టీలో చేర్చే పనిలో బిజీగా ఉన్నారు.ఇక టిఆర్ఎస్ కూడా బిజెపి ,కాంగ్రెస్ లోని నాయకులను గుర్తించి తమ పార్టీలో చేర్చుకుని వారికి పదవులు , ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇస్తూ చేరికలపై ఫోకస్ పెట్టింది.గత వారం రోజులుగా ఈ చేరికలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే 14 మంది సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు కాంగ్రెస్ కు చెందిన ఇతర స్థానిక నాయకులు టిఆర్ఎస్ లో చేరారు.ఒకేసారి బిజెపి టిఆర్ఎస్ లు దూకుడు పెంచడంతో కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది.
తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోలేకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆందోళనలో ఉంది.







