దొంగలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ఖతర్నాక్ ఐడియాలు వేస్తుంటారు.ఒక్కోసారి దొంగలు అడుగు దూరంలో ఉన్న పోలీసుల నుంచి కూడా తెలివితో తప్పించుకోగలరు.
అయితే ఓ కుర్రదొంగ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ తలతిక్క ప్లాన్ వేసి అడ్డంగా దొరికిపోయాడు.ఈ దొంగ తనని పోలీసులు చూడకుండా ఒక పెద్ద టెడ్డీ బేర్‌లో దాక్కున్నాడు.
అయితే పోలీసులు చాలాసేపు అక్కడే ఉండటంతో ఆ టెడ్డీబేర్ లో ఉన్న అతనికి ఊపిరి ఆడలేదు.చివరికి అతడు గట్టిగా గాలి పీల్చుకోవడం స్టార్ట్ చేశాడు.
అలానే ఆ టెడ్డీబేర్ కూడా అటూ ఇటూ కదిలింది.
దీన్ని గమనించిన పోలీసులు తెగ నవ్వుకున్నారు.
“దాచుకుంది చాలేమ్మా, ఇక లే, మీ అత్తారింటికి పోదాం పద” అని అతడిని టెడ్డీబేర్ నుంచి బయటికి తీసుకు వచ్చారు.ఆపై కోర్టులో హాజరుపరచగా తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది.
అనంతరం పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా తెగ నవ్వుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే, జాషువా డాబ్సన్ అనే 18 ఏళ్ల టీనేజర్ ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో మే నెలలో ఒక కారును దొంగలించాడు.అనంతరం ఒక ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్లి ఆయిల్ పోయించుకుని డబ్బులు కట్టకుండా పరారయ్యాడు.
అప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.సీసీ కెమెరాల ఆధారంగా అతని అడ్రస్ ని కూడా పట్టుకోగలిగారు.
అయితే అతని ఇంటికి వెళ్లగానే లోపల ఎవరూ కనిపించలేదు ఒక పెద్ద టెడ్డీబేర్ మాత్రం అక్కడ కూర్చుని ఉంది.దానిని అంతగా పోలీసులు పట్టించుకోలేదు.
ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని కాసేపు అక్కడే ఉన్నారు.అప్పుడే వారికి టెడ్డీబేర్ కదలడం, అందులోనుంచి శ్వాస తీసుకుంటున్నట్లు వినిపించడం జరిగింది.అందులోనే అతడు దాక్కున్నాడని వారికి అర్థమైంది.అతడు ఒక అయిదారు నిమిషాలు ఓపిక పట్టుకున్నట్లయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.
కానీ బ్యాడ్ లక్ ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టు కోలేక దొరికిపోయాడు.