తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచుతుంది.టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే క్రమంలో బలం పుంజుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో పార్టీ హైకమాండ్ గట్టి దృష్టి సారించింది.
ఇందుకోసం గతంలో ఉన్న కమిటీని రద్దు చేసి కన్వీనర్‌గా ఈటెల రాజేందర్‌తో కమిటీ వేశారు.దీంతో తెలంగాణలోని కీలక నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజానికెత్తుకున్న ఈటల రాజేందర్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
త్వరలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్న సందర్భంగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.ఆ రోజు జరిగే సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారు.
వీరిలో రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ ఉన్నారు.ఈటల రాజేందర్ వల్లే వీరంతా బీజేపీలో చేరుతున్నారా? లేక ఇతర నేతల రాయబారుల వల్ల కమలం పార్టీలోకి వస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.కానీ ఈటల రాజేందర్ మాత్రం పార్టీలోకి ప్రధాన నేతలనే కాకుండా క్షేత్రస్థాయి సర్పంచ్ లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను కూడా బీజేపీలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు.ఇదే విషయాన్ని ఆయన బీజేపీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.
క్షేత్రస్థాయి నేతలను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయవచ్చనే ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు.కీలక నేతలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే క్షేత్రస్థాయి నేతలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా అధికార పార్టీని దెబ్బతీయవచ్చనే భావనలో ఈటల రాజేందర్ ఉన్నట్లు సమాచారం.
మరోవైపు అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన తర్వాత చేరికపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు లేకపోయినా.భవిష్యత్తులో అక్కడి నుంచి పెద్ద ఎత్తున చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎంత మంది బీజేపీలో చేరనున్నారు? వీరిలో ఈటల రాజేందర్ ద్వారా ఎంతమంది పార్టీలో చేరారనే అంశం కీలకంగా మారనుందని తెలుస్తోంది.







