తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాజకీయంగా బలపడేందుకు, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది.పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు షర్మిల పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.
పాదయాత్ర , నిరుద్యోగుల దీక్ష తో పాటు తెలంగాణలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నీటి పైనా షర్మిల పోరాటాలు చేస్తున్నారు.అయితే ఆశించిన స్థాయిలో షర్మిల పార్టీలోకి చేరుకలు అయితే కనిపించడం లేదు.
పార్టీ స్థాపించిన మొదట్లో కొంతమంది పేరున్న నాయకులు పార్టీలో చేరినా, వారిలో చాలామంది మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక చిన్నచితక నాయకులు చేరుతున్నారు తప్ప, నియోజకవర్గస్థాయి, రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకులు ఎవరు షర్మిల పార్టీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వలసలు కలకలం రేపుతున్నాయి.ముఖ్యంగా వైఎస్ కుటుంబం కి అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాలాకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉంటున్నారు.
వీరిలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.ఇక వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడే ఛాన్స్ లేదని చెబుతున్నా, ఆయన నిన్న అమిత్ షా తో భేటీ అయ్యారు .దీంతో ఎప్పుడైనా ఆయన పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.వీరే కాకుండా దాసోజు శ్రావణ్, మరి కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు .

కానీ షర్మిల పార్టీ వైపు ఎవరు చూడకపోవడం ఆ పార్టీలో అసంతృప్తిని రాజేష్తోంది.రెడ్డి సామాజిక వర్గంలో కీలక నాయకులు, వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారు ఇలా ఎవరూ షర్మిల పార్టీ వైపు చూడడం లేదు.బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.ఆ మూడు పార్టీల మధ్యనే వలసలు చోటు చేసుకుంటున్నాయి తప్ప, షర్మిల పార్టీ వైపు చూసే వారెవరు కనిపించడం లేదు.
తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని షర్మిల పదేపదే ప్రకటనలు చేస్తున్నా, కేసీఆర్ తీరును, తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నా, ఆ స్థాయిలో తన పార్టీలోకి నాయకులు క్యూ కడతారని ఆశించినా, షర్మిలకు ఇప్పుడు నిరాశ ఎదురవుతుంది.తాను తెలంగాణ కోడలినే అని షర్మిల చెప్పుకుంటున్నా, ఆమె ను ఏపీ వ్యక్తే గానీ జనాలు చూస్తూ ఉండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టుగా అంచనా వేస్తున్నారు.







