కోవిడ్ మహమ్మారి కాస్త నెమ్మదించింది అనుకునేలోపు కొత్తగా మంకీపాక్స్ పుట్టుకురావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే పదుల సంఖ్యలో దేశాలను చుట్టేసిన మంకీపాక్స్ వైరస్ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది.
ఆఫ్రికా దేశాలతో పాటు ప్రస్తుతం అమెరికాలోనూ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.కోవిడ్ తర్వాత ఆ రేంజ్‌లో అమెరికన్లను మంకీపాక్స్ భయపెడుతోంది.
ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా వున్న దేశాల్లో అమెరికా ఇప్పుడు అగ్రస్థానంలో వుంది.అక్కడ న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో కేసులు వున్నట్లు అధికారులు చెబుతున్నారు.
దీంతో అప్రమత్తమైన న్యూయార్క్ ప్రభుత్వ యంత్రాంగం.‘‘స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ’’ ప్రకటించింది.
ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని న్యూయార్క్ గవర్నర్ క్యాచీ హోచుల్ ప్రకటించారు.అమెరికాలో నమోదవుతున్న ప్రతి నాలుగు మంకీపాక్స్ కేసులలో ఒకటి న్యూయార్క్‌లో వెలుగు చూస్తోందని ఆమె అన్నారు.
మరిన్ని వ్యాక్సిన్‌లను భద్రపరచడానికి, పరీక్షల సామర్ధ్యాన్ని విస్తరించడానికి , సురక్షితంగా ఎలా వుండాలనే దానిపై న్యూయార్క్ వాసులకు అవగాహన కల్పించడానికి తాము 24 గంటలూ పనిచేస్తున్నామని గవర్నర్ తెలిపారు.మంకీపాక్స్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసేందుకు గాను తాను స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నానని క్యాచీ హోచుల్ తెలిపారు.
ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తమకు వేగంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుందన్నారు.అలాగే మరింత మంది న్యూయార్క్ వాసులు టీకాలు వేయించుకోవడానికి, అదనపు చర్యలు తీసుకోవడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులను అనుమతిస్తుందని ఆమె అన్నారు.
ఇకపోతే.అమెరికాలోని కీలక నగరాల్లో ఒకటైన శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ మంకీపాక్స్ వ్యాప్తి వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా అక్కడి యంత్రాంగం ‘‘లోకల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’ని ప్రకటించింది.ఈ వైరస్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందని.ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ఎక్కువగా వైరస్ బారినపడుతోందని నగర మేయర్ లండన్ బ్రీడ్ అన్నారు.

యూఎస్ సీడీసీ తాజా గణాంకాల ప్రకారం.దేశంలో 5,189 మంకీపాక్స్ కేసులు వున్నాయి.ఇది ప్రపంచంలోనే అత్యధికం.న్యూయార్క్‌లో అత్యధికంగా 1,345 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ రాష్ట్రాలు నిలిచాయి.సీడీసీ డేటా ప్రకారం.
ప్రపంచవ్యాప్తంగా 22,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.ప్రస్తుత తీవ్రత నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గతవారం ‘‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’’ ప్రకటించిన సంగతి తెలిసిందే.







