భారత్- కెనడాలలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ, 1985 కనిష్క విమాన ప్రమాదం కేసులో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసులో కెనడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిపై పలు అభియోగాలు నమోదు చేశారు.
ఈ నెల 14న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో మాలిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.ఆయన హత్యకు సంబంధించి వాంకోవర్‌కు తూర్పున 75 కిలోమీటర్ల దూరంలో వున్న బ్రిటీష్ కొలంబియాలోని అబోట్స్‌ఫోర్డ్‌కు చెందిన 21 ఏళ్ల టాన్నర్ ఫాక్స్, వాంకోవర్ శివారు న్యూ వెస్ట్‌మినిస్టర్‌కు చెందిన 23 ఏళ్ల జోస్ లోపెజ్‌లను అరెస్ట్ చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు.
సాంప్రదాయిక పరిశోధనాత్మక పద్ధతులు, అద్భుతమైన పోలీస్ వర్క్ ద్వారా తాము ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకోగలిగామని ఇంటిగ్రేటెట్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) ప్రతినిధి సూపరింటెండెంట్ మన్‌దీప్ మూకర్ అన్నారు.మాలిక్ కుమారుడు జస్ప్రీత్ సింగ్ మాలిక్ ఈ అరెస్ట్‌లపై మాట్లాడుతూ.
దర్యాప్తు ఎలా జరిగినా మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయామన్నారు.అయితే కేసు విషయంలో ఐహెచ్ఐటీ బృందం పురోగతి సాధించినందుకు తాము సంతోషిస్తున్నామని చెప్పారు.
ఇద్దరు అనుమానిత వ్యక్తులు ఇలాంటి జీవితాన్ని కోరుకున్నందుకు బాధగా వుందని జస్ప్రీత్ పేర్కొన్నారు.ఇంతకీ తన తండ్రిని వారు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే దానిపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమానితులు ఫాక్స్, లోపెజ్‌లను బుధవారం సర్రే ప్రావిన్షియల్ కోర్టులో హాజరుపరచగా.న్యాయమూర్తి వారికి ఆగస్ట్ 10 వరకు రిమాండ్ విధించారు.మందుగుండు సామాగ్రి, తుపాకీని కలిగి వుండటం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం , అరెస్ట్‌ను అడ్డుకోవడం వంటి తొమ్మిది నేరారోపణలను లోపెజ్‌పై గతంలో కెలోవానాలో మోపారు.ఫాక్స్ కూడా అధికారిని అడ్డుకున్న కేసులో గతేడాది ఏప్రిల్‌లో దోషిగా నిర్ధారించబడ్డాడు.
కాగా.జూలై 14న రిపుదమన్ సింగ్ మాలిక్ సర్రే బిజినెస్ కాంప్లెక్స్‌లో తన కారులో కూర్చుని వుండగా కాల్చి చంపబడ్డాడు.
అక్కడికి కూతవేటు దూరంలో ఒక అనుమానాస్పద వాహనం మంటల్లో కాలిపోయి కనిపించింది.రిపుదమన్ సింగ్ కెనడాలో మొట్టమొదటి ఖల్సా పాఠశాల, ఖల్సా క్రెడిట్ యూనియన్ బ్యాంక్‌ను స్థాపించారు.
అనంతరం సత్నాం ట్రస్ట్‌ని స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు.