బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్ ప్రధమ స్థానంలో ఉన్నారు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ రిషికి గట్టి పోటీ ఇస్తున్నారు.
రిషి సునాక్ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు.ఇప్పటివరకు కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచిన రిషికి.
ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించిన మేర మద్దతు లభించటం లేదని సమాచారం.ఈ విషయాన్ని రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు.
తాజాగా బ్రిటన్‌లోని గ్రాంథాం నగరంలో ప్రసంగించిన సునాక్ ‘తాను ఎంపీల మద్దతు పొందే విషయంలోవెనుకబడి ఉన్నాననడంలో ఎలాంటి సందేహం లేద’ని స్పష్టం చేశారు.
కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారని రిషి అంటున్నారు.
తుదిపోరులో అండర్ డాగ్‌గా బరిలోకి దిగనున్నట్లు రిషి చెబుతున్నారు.రిషి అంటున్నట్టు పార్టీ సభ్యుల్లో మెజారిటీ సభ్యులు రిషి వైపు మొగ్గు చూపితే ఆయన గెలుపు ఖాయం అవుతుంది.ఇప్పటివరకు దూసుకొచ్చిన రిషి తుది పోరులో సైతం ముందంజలో ఉంటారని భావించే వారు లేకపోలేదు.
ఇక బ్రిటన్ ఆపధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం రిషి సునాక్‌ను కాకుండా ఇంకెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ నిర్వహించిన సర్వే సైతం సునాక్‌కు వ్యతిరేకంగా వచ్చింది.మొత్తం 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా.వారిలో 62% ట్రస్‌ను బలపరిచారు.రిషికి 38% మద్దతిచ్చారు.
ఈ సర్వే వెలువడిన తర్వాత బ్రిటన్ ప్రధాని పీఠాన్ని రిషి అధిరోహిస్తారా? అన్న ప్రశ్నకు నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రిషి సునాక్ తన ప్రచారంలో భాగంగా చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. చైనా, రష్యాల విషయంలో రిషి సునాక్ బలహీనుడని ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపణలు చేసిన క్రమంలో రిషి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్ సరైన వ్యక్తి అని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల రాయడం విశేషం.