ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయ హిందువులు మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను అక్కడ కూడా పాటిస్తున్నారు.ఏ దేశానికి వెళ్లినా మూలాలు మరిచిపోకుండా ముందుకు సాగుతున్నారు.
అంతేకాదు.ఆయా ప్రాంతాల్లో హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారు.
ఇప్పుడు అనేక దేశాలలో మన ఆలయాలు వెలుగొందుతుండటం వెనుక వీరి కృషి ఎంతో వుంది.తాజాగా హిందూ మహా సముద్రంలోని విస్తారమైన ద్వీపమైన మడగాస్కర్ రాజధాని అంటనానారివోలో భవ్యమైన హిందూ దేవాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
మంగళవారం జరిగిన కార్యక్రమంలో మడగాస్కర్, కొమొరోస్‌లోని భారత రాయబారి అభయ్ కుమార్ ఆలయాన్ని ప్రారంభించారు.ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు తరలివచ్చి.హారతి ఇవ్వడంతో పాటు , భక్తిగీతాలను ఆలపించారు.ఆలయంలో ఏర్పాటు చేసిన హిందూ దేవతల శిల్పాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా స్థానిక హిందూ సమాజ్ అధ్యక్షుడు సంజీవ్ హేమత్లాల్ మాట్లాడుతూ….మడగాస్కర్‌లోని హిందూ సమాజానికి ఈ ఆలయం గర్వకారణమన్నారు.
ఇకపోతే.ఈ ఆలయం అంటనానారివోలో తొలి హిందూ దేవాలయం.మడగాస్కర్‌లో హిందూ ప్రవాసులు చాలా కాలంగా ఈ ఆలయం కోసం ఎదురుచూస్తున్నారు.భారతీయ మూలాలున్న వారు, ప్రధానంగా గుజరాతీ సంతతి వారు 20 వేల మంది మడగాస్కర్‌లో స్ధిరపడ్డారు.
ఇక్కడున్న గుజరాతీలలో చాలా మంది హిందువులే.హిందూ మహా సముద్ర ప్రాంత వాణిజ్యంలో పాలు పంచుకోవడానికి 18వ శతాబ్ధం చివరిలో వీరంతా చిన్న చిన్న పడవలలో మడగాస్కర్కు వలస వచ్చారు.
అప్పటి నుంచి మడగాస్కర్- భారతదేశం మధ్య వీరు వాణిజ్యానికి ఎంతో దోహదం చేశారు.కాగా.మనదేశం మడగాస్కర్కు ప్రధాన వ్యాపార భాగస్వామి.2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 400 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.వాణిజ్యంతో పాటు రెండు దేశాల మధ్య అనేక రంగాలలో బలమైన సంబంధాలు వున్నాయి.ఆరోగ్యం, విద్య, సంస్కృతి, సమాచారం, ప్రయాణం వంటి అంశాలలో భారత్- మడగాస్కర్ మధ్య ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.