ఒక గ్యాంగ్‌స్టర్ సహా ఇద్దరు ఇండో కెనడియన్‌ల హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.ఆదివారం మధ్యాహ్నం విస్లర్ పట్టణంలో హత్యకు గురైన బాధితులు, అరెస్ట్ అయిన వారందరికి మెట్రో వాంకోవర్ ప్రాంతంలో పనిచేస్తున్న ముఠాలతో సంబంధం వున్నట్లు కెనడా పోలీసులు భావిస్తున్నారు.
ఈ హత్యలకు సంబంధించి కస్టడీలోకి తీసుకున్న ఇద్దరిని సర్రే పట్టణానికి చెందిన 24 ఏళ్ల గుర్సిమ్రాన్ సహోటా, 20 ఏళ్ల తన్వీర్ ఖాఖ్‌గా గుర్తించారు.ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) విడుదల చేసిన వివరాల ప్రకారం.హత్యకు గురైన వారిని సతీందర్ గిల్, మణీందర్ ధాలివాల్‌లుగా గుర్తించారు.
29 ఏళ్ల మణీందర్ ధాలివాల్ ‘బ్రదర్స్ కీపర్స్’ ముఠా సభ్యుడు.ఇటీవలి కాలంలో వాంకోవర్‌లో జరిగిన గ్యాంగ్‌వార్స్, తుపాకీ కాల్పుల ఘటనల్లో ఇతని ప్రమేయం వున్నట్లుగా కెనడా పోలీసులు చెబుతున్నారు.ఇక సతీందర్ గిల్ విషయానికి వస్తే ఇతను ధాలివాల్ స్నేహితుడు.
అతనికి ఏ గ్యాంగ్‌లతోనూ సంబంధాలు లేవు.కాంక్రీట్ ట్రక్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గిల్.
తన పుట్టినరోజును జరుపుకోవడానికి విస్లర్‌కు వచ్చాడు.
నిజానికి.
గతేడాది మేలో వాంకోవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (వీపీడీ) గుర్తించిన ఆరుగురు గ్యాంగ్‌స్టర్‌లలో ధాలీవాల్ కూడా వున్నాడు.ఇతను ప్రత్యర్ధి ముఠా సభ్యుల హిట్ లిస్ట్‌లో ఎప్పటి నుంచో వున్నాడు.
ప్రస్తుతం మణీందర్, సతీందర్ లను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు యూనైటెడ్ నేషన్స్ గ్యాంగ్ సభ్యులుగా తెలుస్తోంది.

సహోటా, కర్మన్ గ్రేవాల్‌తో కలిసి 2019లో స్థానికంగా దొంగతనాలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.గతేడాది మే 9న గ్రేవాల్ వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ వద్ద ప్రత్యర్ధుల చేతుల్లో హత్యకు గురయ్యాడు.అయితే నిందితులు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కేసులో నేటికీ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.2016లో భారత్‌కు బహిష్కరించిన గ్యాంగ్‌స్టర్ జిమీ సంధుకు గ్రేవాల్ అత్యంత సన్నిహితుడని పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం మణీందర్, సతీందర్ హత్య కేసులో ఖాఖ్, సహోటాతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఇందులో వీరి ప్రమేయం ఎంత వుందనేది నిర్ధారణ కావాల్సి వుంది.







