టిడిపి అధినేత చంద్రబాబు గట్టిగానే పార్టీ కోసం కష్టపడుతున్నారు.తను వయసెం సైతం లెక్కచేయకుండా జనాల్లో తిరుగుతున్నారు.ఎండ వానలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.2024లో టిడిపి జెండా ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు .జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతూ పార్టీ నాయకుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం పైన అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు.
బాబు కృషితో ఏపీలో పార్టీ పరిస్థితి గతంతో పోలిస్తే పర్వాలేదు అన్నట్లుగానే ఉంది.అయితే తెలంగాణలో టిడిపి పరిస్థితి పైనే ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది.
చాలా కాలంగా తెలంగాణలో టిడిపి వ్యవహారాలను బాబు పెద్దగా పట్టించుకోవడం లేదు.పూర్తిగా ఏపీ ఫైనే ఫోకస్ పెట్టారు.
అప్పుడప్పుడు తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీని పూర్తిగా జనాలు మర్చిపోకుండా అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు.
అయితే తెలంగాణ టిడిపి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేంత పరిస్థితి లేదు.
పార్టీలో కొంతమంది నాయకులు మాత్రమే మిగిలి ఉన్నారు.ఇప్పటికే చాలామంది ఇతర పార్టీలలో చేరిపోయారు.
ఓటు బ్యాంకు కూడా చెల్లాచెదరయ్యింది. టిడిపిని జాతీయ పార్టీగా చెప్పుకునేందుకు తెలంగాణలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం మినహా పెద్దగా కార్యకలాపాలు కనిపించడం లేదు.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఎల్ రమణ ఉన్న సమయంలో కొద్దో గొప్పో కార్యక్రమాలు చేపట్టినా, ఇప్పుడు పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీలోని నాయకులకు కానీ, చంద్రబాబు గాని పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.తెలంగాణలో టిడిపి కార్యక్రమాల కోసం సొమ్ములు ఖర్చుపెట్టినా, అవి వృధానే అన్న అభిప్రాయం చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ నాయకులలోను ఉంది.

కేవలం చెప్పుకోవడానికి తప్ప , టిడిపి తరఫున కార్యక్రమాలు ఏవీ జరగడం లేదు.తెలంగాణ మొత్తంగా చూస్తే ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప టిడిపి కి పెద్దగా బలం లేదు.అసలు అక్కడ రాబోయే ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా లేదా అనే విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు.ఏపీలో కంటే ఒక సంవత్సరం ముందుగానే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి.
ఇప్పటి వరకు దానికి సంబంధించిన కసరత్తు ఏమి చేయడం లేదు.ఇక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు, టిడిపి తెలంగాణ నాయకులు కనీసం సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయం పై దృష్టి పెట్టకపోవడం , చంద్రబాబు కూడా అంత ఆసక్తిగా లేకపోవడం వంటివి చూస్తే ఇక తెలంగాణ టిడిపి పై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తున్నారు.







