గత 5 నెలల నుంచి రష్యా , ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.అయినా రష్యా కు ఇంకా పట్టు చిక్కడం లేదు.
ఒక బలమైన దేశం ఇన్ని నెలలుగా యుద్ధం చేయడం,పూర్తిగా హస్తగతం చేసుకోకపోవడం విడ్డురం.ఇక్కడ ఉక్రెయిన్ సాహసం ప్రశంసించ దగ్గది.
ఎన్నో కష్టాలు ,నష్టాలు అది చవి చూసింది.కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను పోగొట్టుకుంది.
ముఖ్యమైన నగరాలు ద్వంసం చేయబడ్డాయి.అయినప్పటికీ ఎదురొడ్డి నిలబడి రష్యాను నిలువరించడం మాటలు కాదు.
దీనికి అక్కడి సైనికులు ,పౌరులు పూర్తిగా ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నారు.అందుకు కొన్ని రాజ్యాలు ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేయడం కూడా ఉక్రెయిన్ కు కలసి వచ్చింది.
రష్యా ఎంతటి భీకరమైన వైఖరి ప్రదర్శించి నప్పటికి అది ఇంకా పురిటి స్థాయి లోనే ఉంది.ఒక బలమైన దేశం యుద్ధాన్ని సాగదీస్తుండడం పౌరులకు, సైనికులకు మంచిది కాదు.
దానికి తోడు దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా మారిపోవడం,ఉక్రెయిన్ కు మద్దతు పలకడం చూస్తున్నదే.మద్దతు అయితే పలుకుతున్నాయి కాని ఉక్రెయిన్ తో కలసి యుద్ధానికి దిగడం లేదు.
ఒకవేళ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న దేశాలన్నీ ఉకుమ్మడిగా దాడి చేస్తే మాత్రం రష్యా కు ఇబ్బందే.అందుకే దేశాలు కొన్ని మిన్నకుంది పోయాయి.కోరి ఎందుకు కష్టాలు తెచ్చుకోవాలి అనే మిష తో ఉన్నాయి.రెండు దేశాలలోనూ తీవ్ర ఆహార కొరత ఉంది.
ఈ ప్రభావం ఇతర దేశాలకూ పాకింది.రెండు దేశాలలో ఆర్ధిక పరిస్థితి కూడా దిగ జారింది.
ఖర్చు తడిసి మోపెడవుతోంది.అయితే దేశ ప్రజలు అలవాటు పడి జీవిస్తున్నారు.
తమ అవసరాలు ఎన్ని కష్టాలు ఉన్నా తీర్చుకుంటున్నారు.సైనికులలో కూడా తీవ్ర నిరాసక్తత కనపడుతోంది.రష్యా జన సమర్ధం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నా అది సహేతుకంగా లేదు.‘కీవ్ ‘ ను స్వాధీనం చేసుకుంటే మాస్కోకు అడ్డు ఉండదు.అయితే కీవ్ , రష్యాకు చిక్కడం లేదు అదే పెద్ద లోటు.ఇటీవలే రెండు దేశాలు ఆహార విషయం పై ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.అయితే వెంటనే రష్యా ఆ ఒప్పందంకు మాట మార్చి తిలోదకాలు ఇచ్చింది.ఇది అగ్ర దేశమైన రష్యాకు తగదు.
ఒప్పందం , చర్చలు ప్రతి దేశం గౌరవించాలి.అటువంటప్పుడు ఆ దేశాధినేతల సంతకాలకు విలువ ఉండదు.
దేశ ప్రజల నుంచి, ప్రపంచ దేశాల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవలసి వస్తుంది.

ఆహార సంక్షోభం నివారణ కోసం టర్కీ కృషి సల్పింది.ఇది సత్పలితాలు ఇచ్చింది.రష్యా,ఉక్రెయిన్ లు రెండు కూడా టర్కీ మధ్యవర్తిత్వం గౌరవించి ఒక ఒప్పందానికి రావడం అనేక దేశాలకు ఊరట కలిగిస్తోంది.
ఒక వైపు గోధుమలు ఉక్రెయిన్ లో నిల్వ ఉన్నాయి.రష్యాలోను ఆహార సంక్షోభం ఉంది, నిత్యావసర వస్తువైన వంట నూనెల కొరత ఉంది.అన్ని దేశాలు చాలా వరకు గోధుమలు, వంట నూనెలు రష్యా, ఉక్రెయిన్ లపై ఆధారపడుతున్నాయి.ఇప్పుడు భారీగా రెండు దేశాలలో ఎగుమతులు నిల్చి పోయాయి.
దీని ఫలితంగా అనేక దేశాలు ఆహార కొరతతో అలమటిస్తున్నాయి.ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆహార సంక్షోభం అధిగమించుటకు రష్యా ,ఉక్రెయిన్ లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అయితే ఆ ఒప్పందానికి విలువ ఇవ్వకుండా రష్యా క్షిపణులు ఉక్రెయిన్ లోని ఒడెస్సా పోర్ట్ పై దాడి చేయడం దారుణం.ఒప్పందం చేసుకుని వెంటనే దాడి చేయటం ప్రపంచ దేశాలు మండి పడుతున్నాయి.

24 గంటలు గడవక ముందే రష్యా మాట మార్చడంతో దాని వైఖరి స్పష్టమవుతోంది.ఏమి సాధించాలని రష్యా ఈ ఒప్పందానికి తూట్లు పొడిచిందో అర్ధం కావడం లేదు.ఉక్రెయిన్ పూర్తిగా తన ఆధిపత్యం లోకి తీసుకుందా అంటే అదీ లేదు.ఇప్పుడు ఒడెస్సా పోర్ట్ లోని ఆహార ధాన్యాలు నిల్వ ఉండే ప్రాంతంలో దాడులు చేసి ఏమి బావుకుంటుందో అర్ధం కావడం లేదు.
పలు దేశాల ఆహార కొరతతో, ఆకలి కేకలతో ఉంటే రష్యా పంతాలకు పోవడం శోచనీయం.దీని వలన రష్యాకు చెడ్డ పేరే కాని దేశాల మద్దతు ఉండదు.
మునుముందు రష్యాకు ఇబ్బందులు తప్పక పోవచ్చు.ఇప్పటికైనా రష్యా తన తప్పిదం దిద్దుకొని ఒడెస్సా పోర్ట్ లో ఉన్న ఆహార నిల్వలుపలు దేశాలకు పంచితే మేలు అటు ఉక్రెయిన్, ఇటు రష్యాకు చాలా వరకు సమస్యలు తీరతాయి.
ఇక యుద్ధం కూడా ఆగిపోవడానికి ఎంతో కాలం పట్టదు.ఆ దిశలో అడుగు వేయాల్సింది రష్యా నే.







