భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ కెనడాలో సత్తా చాటారు.ఇంటర్ డిసిప్లనరీ రీసెర్చ్‌లో మార్గనిర్దేశం చేసినందుకు గాను Schmidt Science Polymaths Award అవార్డును గెలుచుకుని… ఈ ఘనత సాధించిన తొలి కెనడియన్‌గా రికార్డుల్లోకెక్కారు.
యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా (యూబీసీ) అప్లైడ్ సైన్స్ ఫ్యాకల్టీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుదీప్ శేఖర్ ఈ అరుదైన ఘనత సాధించారు.వైద్య నిర్ధారణను చాలా వేగంగా చేయగల కాంపాక్ట్ బయోమెడికల్ సెన్సార్‌పై పరిశోధన చేసినందుకు గాను ఆయన 2.5 మిలియన్ల రివార్డును అందుకోనున్నారు.
Schmidt Science Polymaths award 2022 కోసం ఎంపికైన పది మంది పరిశోధకులలో సుదీప్ కూడా ఒకరు.
ఆయన నేతృత్వంలోని బృందం తయారు చేసిన పరికరం ద్వారా రక్తం, లాలాజలం, మూత్రం వంటి ద్రవాలను సులభంగా విశ్లేషించవచ్చు.దీనిని స్మార్ట్‌ఫోన్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు.వైరస్, గుండె సంబంధిత, నాడీ సంబంధిత, ఇతర వ్యాధులకు సంబంధించిన డేటాను సేకరించగల చౌకైన మెడికల్ టెస్టింగ్ కిట్‌గా దీనిని యూబీసీ అభివర్ణించింది.సిలికాన్, ఫోటోనిక్స్ రెండింటి శక్తిని కలపడం ద్వారా మనం ఈ వాస్తవికతకు దగ్గరగా వస్తున్నామని యూబీసీ తెలిపింది.
ఫోటోనిక్స్, బయో మెడికల్, పాథాలజీ రంగాలలో నిపుణులైన వారు ఈ ప్రాజెక్ట్‌లో పనిచేశారు.ముందుగా లాబోరేటరీలో కోవిడ్ 19ని విజయవంతంగా నిర్ధారించడం ద్వారా శాస్త్రవేత్తలు దీని పనితీరును తెలియజేశారు.

అంటువ్యాధులు, గుండె ఆగిపోవడం వంటి పరిస్ధితులకు పరిమాణాత్మక పరీక్షలను అందించగల సామర్ధ్యం కారణంగా భారతదేశంపై ఈ పరికరం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని శేఖర్ అభిప్రాయపడ్డారు.బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో పుట్టి పెరిగిన ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్నారు.ఈ పరికరం సరసమైన ధరకే అందుబాటులోకి వస్తుందని.ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ ప్రారంభించే ముందు వచ్చే రెండేళ్లలో దీనిని మరింత సూక్ష్మీకరిస్తామని సుదీప్ చెబుతున్నారు.







