ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.టీడీపీ 23 సీట్లకు మాత్రమే పరిమితమై చతికిలపడింది.
అయితే వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది.అటు మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ పట్టుదలతో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీల్లో కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే రకమైన సీన్లు కనబడుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీలలో కామన్‌గా కొన్ని పాయింట్లు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ఆధిపత్య పోరు రెండు పార్టీలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఆధిపత్య పోరు కారణంగా పలు నియోజకవర్గాల్లో అంతర్గత పోరు బహిర్గతం అవుతోంది.దీంతో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది.కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యేకు స్థానిక నేతలతో ఏ మాత్రం పడటం లేదు.
ఇదే జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల్లో టీడీపీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది.అనంతపురం జిల్లా టీడీపీలో కళ్యాణ దుర్గం, పుట్టపర్తి, అనంతపురం, మడకశిర, కదిరి, గుత్తి నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి.
అలాగే వైసీపీలో హిందూపురంలోని నేతల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి.

మరోవైపు రాయలసీమలోని కర్నూలు జిల్లాను చూస్తే వైసీపీకి పెద్ద సమస్యలు కనిపించకపోయినా టీడీపీకి మాత్రం నంద్యాల, ఆళ్ళగడ్డలో గొడవలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీలో చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు, తంబళ్ళపల్లి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, తిరుపతిలో గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి అజమాయిషీ కారణంగా చిత్తూరు జిల్లాలో ప్రస్తుతానికి పరిస్థితి మొత్తం కామ్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలోని పలు నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలలో అంతర్గతంగా డిష్యుం డిష్యుం నడుస్తోంది. గన్నవరం, మచిలీపట్నం లాంటి ప్రాంతాలలో వైసీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగినా అవి ఇంకా పరిష్కారం కాలేదు.వచ్చే ఎన్నికల నాటికి రెండు ప్రధాన పార్టీలలో అంతర్గత పోరు సద్దుమణుగుతుందేమో వేచి చూడాలి.







