ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి మూడేళ్లు దాటుతోంది.సాధారణంగా ఎన్నికలను ఎదుర్కోవాలంటే భారీ మొత్తంలో డబ్బులు చేతిలో ఉంచుకోవాలి.
కానీ ప్రస్తుతం టీడీపీలో పలువురు నేతల పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది.నాడు పదవులు అనుభవించిన నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.
మరో రెండేళ్ల వరకు ఎన్నికలు లేకపోవడంతో ప్రజల ముందుకు వచ్చేందుకు ఆయా నేతలు ఇష్టపడటం లేదు.
ఏపీలో 2024 ఎన్నికలు పూర్తిగా ఢీ అంటే ఢీ అనేలా సాగుతాయని అందరూ అంచనా వేస్తున్నారు.
ఈ విషయంలో రెండో మాటకు తావు లేదని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ టికెట్లు తెచ్చుకున్న నేతలు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే ఇటీవల టీడీపీ మినీ మహానాడు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ఇప్పటి నుంచే మినీ మహానాడు వంటి ఇతర కార్యక్రమాలకు తాము ఖర్చులు చేయలేమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఇప్పుడు ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తే ఎన్నికల నాటికి బలహీనపడిపోతామని టీడీపీ నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితి టీడీపీకి అనుకూలంగా ఉందని రిపోర్టులు అందుతున్నాయి.
ఈ పరిస్థితులను కొనసాగించేందుకు వరుస టూర్లు చేయాలని.అనేక కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ అధిష్టానం కోరుతున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం నోరుమెదపని పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినాయకత్వం చాలా చోట్ల టికెట్లు కన్ ఫర్మ్ చేయలేదు.దాంతో ఎవరికి టికెట్ వస్తుందో తెలియని వేళ తాము ముందుకొచ్చి చేతులు కాల్చుకోవడం కూడా మంచిది కాదన్న ఆలోచనలతో పలువురు నేతలు ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వెనకడుగు వేస్తున్నారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తమకు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిధుల సాయం కావాలని పలువురు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే టీడీపీ హైకమాండ్ తమ దగ్గర అన్ని నిధులు లేవని చెప్తోందని టాక్ నడుస్తోంది.
మరి భవిష్యత్‌లో టీడీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి.







