తన దేశంపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి గుణపాఠం చెప్పారు.రష్యాపై విధించిన ఆంక్షల్ని క్రమక్రమంగా తొలగించేలా ఒత్తిడి పెంచారు.
ఇప్పటికే రష్యాపై ఆంక్షల విషయంలో జర్మనీ ఓ అడుగు వెనక్కి తగ్గింది.తన లక్ష్యం నెరవేరడంతో నార్డ్‌స్ట్రీమ్-1 పైపులైన్ నుంచి జర్మనీకి గ్యాస్ సరఫరాను ప్రారంభించారు.
గ్యాస్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు ప్రారంభించినప్పటికీ అది పూర్తి సామర్థ్యంతో కాదు.కేవలం 40శాతం మాత్రమే ప్రస్తుతం సరఫరా చేస్తామని రష్యా తెలిపింది.
మొత్తమ్మీద చలికాలం ప్రారంభానికి ముందే ఐరోపాలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించడంతో ఆయా ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.రష్యా గ్యాస్ అందకపోతే ఐరోపాలోని చాలా దేశాల్లో చలికాలం ఇళ్లను వేడిగా ఉంచడం సాధ్యంకాదన్నది గమనార్హం.
అయితే, ఈ నెలాఖరుకి గ్యాస్ సరఫరా 20శాతం తగ్గే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ సంకేతాలిచ్చారు.రష్యాలోని గ్యాస్ కంప్రెషర్ స్టేషన్‌లో రెండు టర్బైన్లు మాత్రమే ఉన్నాయి.
వాటిలో ఒకటి వార్షిక మెయింటెనెన్స్‌కు వెళ్లనున్నడంతో సరఫరాకు కోత విధిస్తున్నారు.కెనడా నుంచి వచ్చే టర్బైన్‌ను ఆ స్థానంలో ఉంచే వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని రష్యా తెలిపింది.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిందన్న కారణంతో రష్యా పరికరాలను వాపస్ ఇచ్చేందుకు నిరాకరించిన కెనడా కూడా ఓ మెట్టు దిగింది.కెనడా తొక్కిపట్టిన టర్బైన్‌ను ఎట్టకేలకు జర్మనీకి అప్పగించింది.సాధారణంగా సముద్ర మార్గంలో పంపిస్తే ఆలస్యమవుతుందని భావించిన కెనడా.దానిని ఎయిర్‌కార్గో ద్వారా జర్మనీకి చేర్చింది.అది అక్కడి నుంచి మరో రెండు మూడురోజుల్లో రష్యాకు చేరుకోనుంది.టర్బైన్ పనిచేయడం ప్రారంభమైతే జర్మనీకి గ్యాస్ సరఫరా మరింత పెరగనున్నది.
రష్యాలోని వ్యీబోర్గ్ నుంచి జర్మనీలోని లుబ్ మిన్ వరకు ఒక వెయ్యి 224 కిలోమీటర్ల మేర బాల్టిక్ సముద్రంలో నిర్మించిన పైపు లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది.







