జనసేన పార్టీ రాజకీయంగా కాస్త యాక్టివ్ అయింది.ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాల పైన, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన పోరాటానికి దిగుతోంది.ముఖ్యంగా అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి పై జనసేన నిర్వహిస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ ఆ పార్టీని జనాలకు చేరువ చేసేందుకు బాగా ఉపయోగపడింది.2024 ఎన్నికల నాటికి జనసేన మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ అధినేత పవన్ భావిస్తున్నారు.క్షేత్రస్థాయిలో జనసేన ను బలోపేతం చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా , జనసేనలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తప్ప మిగతా నాయకులు ఎవరు అంతగా ఫోకస్ కాకపోవడం చర్చనీయాంశం గా మారింది.
జనసేన ను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు నియోజకవర్గాల్లో చాలామంది కీలక నాయకులు పనిచేస్తున్నారు.జనసేన తరఫున క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీని జనాలకు చేరువ చేసేందుకు ఎంతో మంది నాయకులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.
అయితే వారు ఎవరికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదనే భావన ఉంది.జనసేన తరఫున యాక్టివ్ గా కార్యక్రమాలు చేపట్టే విధంగా నియోజకవర్గాల వారీగా ఎవరికి ఏ బాధ్యతలను అప్పగించడం లేదు . ఏ కార్యక్రమం అయినా పవన్ కళ్యాణ్ ముందుండే నిర్వహిస్తున్నారు .ఒకవేళ ఆయన అందుబాటులోకి లేకపోతే నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు తప్ప , వేరే ఎవరికీ ఆ బాధ్యతలను అప్పగించేందుకు, జనసేన తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు స్వతంత్రం ఇవ్వడం లేదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి .జనసేన పేరు చెబితే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేర్లు తప్ప , మిగతా నాయకులు ఎవరూ అంతగా ఫోకస్ కావడం లేదు.ఏ అంశంపైనైనా మాట్లాడే అవకాశం ఇతర నాయకులకు లేకుండా పోయిందనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి.
ఇక ఏ సమస్య పైన అయినా నేరుగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడే అవకాశం కింది స్థాయి నాయకులకు లేకుండా పోయింది.ఇక నాదెండ్ల మనోహర్ తోను పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడేందుకు జిల్లా స్థాయి నాయకులకు అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ తప్ప జనసేన కార్యక్రమాలు ఏవి మిగతా నాయకులు నిర్వహించేందుకు అవకాశం ఉండడం లేదు.ఆ విధంగా బాధ్యతలు అప్పగించేందుకు పవన్ ఇష్టపడకపోవడంతో జనసేన ఇప్పటికీ బాలరిష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు వెళ్తే పార్టీ మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్ అభిప్రాయాలు జనసేన నాయకులు నుంచే వ్యక్తం అవుతున్నాయి.







