పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎన్నో కారణాలతో విదేశాలకు వెళ్ళిపోతున్న వారి సంఖ్య ప్రతీ ఏటా లక్షల్లోనే ఉంటోంది.అంతేకాదు వలసలు వెళ్ళిన వారు అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఇక భారత్ లో ఉండకూడని నేపధ్యంలో శాశ్వతంగా భారత్ ను ఎంతో మంది భారతీయులు వీడిపోతున్నారు.
ఒకరు కాదు రెండు కాదు ఏకంగా లక్షలాది మంది శాశ్వతంగా భారత్ ను వీడిపోతున్నారని కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రకటించింది.
గడిచిన ఏడాది సుమారు 1.63 లక్షల మంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వాడులుకున్నారట.ఈ విషయాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.2021 ఏడాదికి గాను 1.63 లక్షలు ఉండగా 2019 ఏడాదికి గాను వీరి సంఖ్య 1.44 లక్షలు ఉందని తెలిపింది.ఈ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడాదికి భారత్ ను వీడిపోతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా రెట్టింపవుతోంది.కాగా భారత్ ను వీడుతున్న వారిలో అత్యధికంగా అమెరికాకు వలస వెళ్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి.
2020 లో భారత్ నుంచీ అమెరికా వెళ్ళిన వారి సంఖ్య 30 వేలుగా ఉండగా 2021 ఏడాదికి గాను ఇది రెండింతలు అయ్యింది అంటే సుమారు 78 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు.ఇక అమెరికా తరువాత భారతీయులు ఎక్కువగా స్థిరపడుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే. 2020 లో సుమారు 13 వేల మంది ఆస్ట్రేలియా వెళ్ళగా 2021 లో దాదాపు 24 వేల మంది ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని తీసుకున్నారు.
అయితే తాజాగా కెనడా వైపు భారతీయులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారట.భవిష్యత్తులో అమెరికా కంటే కూడా కెనడా కే భారతీయులు వలసలు వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.







