సూర్యాపేట జిల్లా:మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ.తోటి స్నేహితులతో కలసి కిరాతకంగా హత్య.
తిమ్మాపురం గుట్టల్లో శవం.మృతుని భార్య మిస్సింగ్ కేసు పెట్టడంతో వీడిన మిస్టరీ.
సృష్టిలో రక్త సంబంధం కంటే కూడా అత్యంత బలమైనది,పవిత్రమైనది స్నేహ బంధం.అలాంటి స్నేహ బంధాన్ని అపవిత్రం చేస్తూ,మద్యం మత్తులో ఓ స్నేహితుడిని మరో స్నేహితుడు మరికొంత మంది స్నేహితులతో కలసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే సూర్యాపేట రూరల్ మండలం రాజ్ నాయక్ తండాకు చెందిన సంపంగి ప్రవీణ్(23) కారు డ్రైవర్ గా పని చేసేవాడు.అదే గ్రామానికి చెందిన లునవాత్ హరి, ప్రవీణ్ మంచి స్నేహితులుగా ఉండేవారు.
స్నేహితులైన ప్రవీణ్,హరి మద్యానికి బానిసలై నిత్యం తాగుతూ ఉండేవారు.ఈ కారణంగా ప్రవీణ్ గత కొన్ని రోజులుగా డ్రైవర్ పని మానేసి హరితో కలిసి తాగి తిరుగుతుండేవాడు.
ఈ క్రమంలో బుధవారం హరి పని ఉందని ప్రవీణ్ కు ఫోన్ చేయడంతో ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్ళాడు.ఆ రాత్రి,తెల్లారాక కూడా ప్రవీణ్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ప్రవీణ్ భార్య విజయరాణి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో తన భర్త కనిపించడం లేదని గురువారం మిస్సింగ్ ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవీణ్ గురించి దర్యాప్తు మొదలుపెట్టారు.ఇదే సమయంలో శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గుట్టలో గుర్తు తెలియని శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు బుధవారం ఇంటి నుండి హరితో బయటికి వెళ్లిన ప్రవీణ్ శవంగా గుర్తించారు.
పోలీసుల అదుపులో హంతకుడు హరి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు హరిపై అనుమానంతో సూర్యాపేటలో అతనిని అదుపులోకి తీసుకొన్నారు.
హరిని పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా జరిగిన విషయాన్ని మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు.గత రెండు రోజులుగా కలిసి మద్యం సేవిస్తున్నామని,మద్యం మత్తులో ఘర్షణ ఏర్పడి ప్రవీణ్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఈ హత్యలో తనతో పాటు మరో ఎనిమిది ఉన్నారని,అందరం కలిసి నెమ్మికల్ వద్ద ప్రవీణ్ గొంతు నులిపి హత్య చేశామని,ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గుట్టలో ప్రవీణ్ మృతదేహాన్నీ పడేసి వచ్చామని తెలిపాడు.ప్రవీణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్థం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిపిటల్ కు తరలించి,మృతునిభార్య విజయరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు,మరో 8 మంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు రూరల్ ఎస్సై సాయిరాం తెలిపారు.
రాజ్ నాయక్ తండాలో విషాదఛాయలు ఆపదలో ఆదుకునే స్నేహితుడే నమ్మకంలో మోసం చేసి,మద్యం మత్తులో ఘర్షణ పడి,దారుణానికి వడిగట్టి స్నేహితుడి ప్రాణాలు తీయడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.