ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు జోష్ కనిపిస్తోంది.ఇతర పార్టీలలోని నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతుండడంతో, కాంగ్రెస్ ఎన్నికల సమయం నాటికి మరింత బలం పెంచుకోవడంతో పాటు , రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుంది అనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.
ఇది ఇలా ఉండగానే , ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది.వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభావం పెరిగే కొద్దీ కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవని, ప్రస్తుతం ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నా, రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని, అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందిస్తూ వస్తున్న రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ , రాజశేఖరరెడ్డి అభిమానుల ఓట్లలో చీలిక వస్తుందని, అదే జరిగితే కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ తింటుందనే రిపోర్ట్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఇచ్చారట.

షర్మిల తో పాటు, విజయమ్మ కనుక రాజకీయ యాత్రలు చేపడితే డామేజ్ మరింత ఎక్కువగా ఉంటుందని, షర్మిల చీల్చబోయే ఓట్లు అన్ని టిఆర్ఎస్ కు కలిసి వస్తాయని, కానీ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతాయని సునీల్ రిపోర్ట్ అందించారట.దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరింత అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు , దీనిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.మైనారిటీ ఓట్లే కాంగ్రెస్ కు కీలకమని, ఆ ఓట్లు షర్మిల పార్టీ వైపుకు వెళ్లకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలనే విషయంపై చర్చించినట్టు సమాచారం.
తెలంగాణ లో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టే వ్యూహంతో ముందుకు వెళ్తున్న షర్మిల కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
.






