ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో మాస్కోను నిలువరించేందుకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా రష్యా నుంచి ఎలాంటి ఆయుధాలు, ఇతర వస్తువులు దిగుమతి చేయడంతో పాటు ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది భారత్ కు శరాఘాతంగా మారింది.రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే తాజాగా అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ డీల్ పై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.
CAATSA ఆంక్షలు ఇండియాపై పడకుండా చూడాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగా కాట్సా ఆంక్షల నుంచి భారత్ ను మినహాయించాలని కోరుతూ రో ఖన్నా యూఎస్ ప్రతినిధుల సభలో ఒక శాసన సవరణను ప్రవేశపెట్టారు.
భారత్ – అమెరికా రక్షణ భాగస్వామ్యం పటిష్టంగా వుండేందుకు ఈ ఆంక్షల మినహాయింపు ఉత్తమైనదిగా రో ఖన్నా అభివర్ణించారు.రష్యా, చైనా సన్నిహిత సంబంధాలను, భాగస్వామ్యాన్ని దృష్టిలో వుంచుకుని దురాక్రమణదారులను అరికట్టడానికి ఇది తప్పనిసరని రో ఖన్నా శాసన సవరణను ప్రతిపాదించారు.
ఈ చారిత్రాత్మక సవరణ యూఎస్- భారత్ రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ – చైనా సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుతో , చైనా నుంచి భారత్ బెదిరింపులను ఎదుర్కొంటోందని రో ఖన్నా తన తీర్మానంలో ప్రస్తావించారు.
భారతదేశం తన రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడుతోందని.అందువల్ల ఇండియాకు గట్టి మద్ధతునిస్తూ అమెరికా అదనపు చర్యలు తీసుకోవాలని సవరణ తీర్మానంలో ఆయన తెలిపారు.

ఇకపోతే.CAATSA అనేది కఠినమైన చట్టం.ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో పాటు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందున్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రధాన రక్షణ హార్డ్ వేర్ లను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా పరిపాలనా యంత్రాంగానికి అధికారం ఇస్తుంది.ఈ చట్టాన్ని 2017లో తీసుకొచ్చారు.
రష్యా నుంచి రక్షణ, ఇంటెలిజెన్స్ విభాగాలలో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా అమెరికా ప్రభుత్వం శిక్షాత్మక చర్యలను విధించవచ్చు.అక్టోబర్ 2018లో ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలకు సంబంధించి ఐదు యూనిట్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది.
అయితే ఈ ఒప్పందంపై భారత్ ముందుకెళితే.ఆంక్షలను విధిస్తామని అప్పటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది.అయితే కాట్సా చట్టం ప్రకారం భారత్ పై ఆంక్షలు విధించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఈ ఏడాది ఏప్రిల్ లో స్పష్టం చేశారు.
—







