సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఎన్నో సంవత్సరాలు చదివితే గానీ సాధ్యం కాదు.ఇక భారతదేశ వ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొనే రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించాలంటే మామూలు విషయం కాదు.20 ఏళ్ల పైబడిన తర్వాత నే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి.అయితే తాజాగా ఓ పది నెలల చిన్నారి రైల్వేలో ఉద్యోగం సంపాదించింది.
ఈ విషయం తెలిసిన అందరూ నోరెళ్లబెడుతారు.అసలు పది నెలల పాపకు ఉద్యోగం ఎలా ఇస్తారు? ఆమె ఎలా జాబ్ సంపాదిస్తుంది అనే కదా మీ ప్రశ్న.అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర కుమార్ యాదవ్ పీపీ యార్డ్ బిల్లాయ్ లో రైల్వే అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
అయితే జూన్ 1న ఆయన తన భార్య, పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో రాజేంద్ర, అతని భార్య మంజు స్పాట్ లోనే చనిపోయారు.
వారి కూతురు రాధిక మాత్రం ప్రాణాలతో బయటపడింది.చిన్నారి వయసు ఇప్పుడు కేవలం పది నెలలే! తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత రాధిక తన అమ్మమ్మ దగ్గర పెరుగుతోంది.
అయితే ఇండియన్ రైల్వేస్ ఎవరైనా ఉద్యోగి విధి నిర్వహణలో ఉండి మరణిస్తే.వారి కుటుంబ సభ్యులకు జాబ్స్ ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తోంది.
కరోనా సమయంలో కూడా చాలామంది రైల్వే ఉద్యోగులు చనిపోయారు.వీరి కుటుంబ సభ్యులకు ఇండియన్ రైల్వే జాబులు ఇచ్చింది.
అయితే రాధిక విషయంలో కూడా న్యాయం చేయాలంటూ బంధువులు రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిన్నారి రాధికకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ రైల్వే డివిజన్‌లో ఉద్యోగం ఇచ్చారు.ప్రస్తుతం రాధిక వయసు పది నెలలే కాబట్టి ఆమె 18 ఏళ్ళు నిండిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవచ్చు.
రైల్వే అధికారులు బుధవారం రాధిక వేలిముద్రలు తీసుకొని ఆమె ఉద్యోగాన్ని రిజర్వ్ చేశారు.దీంతో 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమె నేరుగా జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు.
అయితే ఇలాంటి నియామకం జరగడం బహుశా రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చని పలువురు అంటున్నారు.పది నెలల పాప తన తల్లిదండ్రులను కోల్పోవడం చాలా విచారకరమని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.








