యూకేలో దారుణం జరిగింది.16 ఏళ్ల భారత సంతతి బాలుడిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.దీనికి సంబంధించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇంగ్లాండ్ లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని వోల్వర్‌హాంప్టన్‌లో ఈ ఘటన జరిగింది.మృతుడిని రోనన్ కందా (16)గా గుర్తించారు.గత బుధవారం అతనిని నిందితులు హత్య చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయితే పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రోనన్‌పై దుండగులు రెండుసార్లు కత్తితో దాడి చేసినట్లు వైద్యులు నివేదికలో తెలిపారు.
బర్మింగ్‌హామ్‌కు చెందిన జోసియా ఫ్రాన్సిస్ (20) , ఇద్దరు మైనర్లు కలిసి.16 ఏళ్ల మృతుడిని హత్య చేసినట్లు వోల్వర్‌హాంప్టన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.ఈ ఘటనపై రోనన్ కుటుంబ సభ్యులు సంతాప ప్రకటన విడుదల చేశారు.
అతను తన తోటివారిని నవ్విస్తూ వుంటాడని… కానీ తనను క్రూరంగా చంపారని, ఈ వార్త తెలిసి తమ హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు వారు సంతాప సందేశంలో పేర్కొన్నారు.

మరోవైపు.నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు గాను సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు.దీనిలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు స్పష్టం చేశారు.
అయితే ఈ ఘటనలో నిందితులుగా వున్న 15 ఏళ్ల బాలుడు, 18 ఏళ్ల యువకుడిని పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు.







