ఏపీ అధికార పార్టీ గా ఉన్న వైసీపీ ని మరింత బలోపేతం చేసే విధంగా ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.2019 ఎన్నికల్లో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంది.2024 ఎన్నికల్లో మాత్రం 175 స్థానాలకు 175 గెలుచుకోవాలనే టార్గెట్ జగన్ విధించారు.పార్టీని ఎంతగా బలోపేతం చేయాలని జగన్ చూస్తున్నారో అంతగా పార్టీలోనూ అసంతృప్తులు పెరిగిపోతున్నారు.
నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కీలక నేతలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు.తమకు పార్టీలోను ప్రభుత్వంలోనూ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు అనే అసంతృప్తితో ఉన్నారు.
టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలను ఇస్తున్నారు.ఇప్పటికే రాజోలు నియోజకవర్గం లో వైసీపీ నుంచి టిడిపికి వలసలు మొదలయ్యాయి.
శ్రీకాకుళం నుంచే వలసలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత వైసిపి నేత కిల్లి కృపారాణి తనకు సరైన ప్రాధాన్యం పార్టీలో దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు జగన్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు హెలిపాడ్ వద్దకు ఆమె వెళ్లే ప్రయత్నం చేయగా… స్వాగతం పలికే నేతల జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆమెను వారించి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆమె ఆగ్రహంతో వెను దీరిగారు.
అప్పటికే ఆమె పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదు అనే అసంతృప్తి తో ఉండగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది ఇలా ఉంటే ఆమె టిడిపిలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది.

రాబోయే ఎన్నికల్లో తనకు ఏ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తారో క్లారిటీ వచ్చిన తర్వాత టిడిపిలోకి వెళ్లాలని చూస్తున్నారట.గతంలో శ్రీకాకుళం ఎంపీ గా ఆమె పనిచేశారు.ఇప్పుడు టిడిపి లోకి వెళ్ళినా శ్రీకాకుళం ఎంపీ సీటు రామ్మోహన్ నాయుడు కి తప్ప వేరొకరికి ఇచ్చే అవకాశం లేదు.ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ధర్మాన ప్రసాదరావు పై టిడిపి నుంచి పోటీ చేస్తారా అంటే అక్కడ సామాజిక సమీకరణాలు లెక్కల్లో కృపారాణి కి ఛాన్స్ దొరికే అవకాశం లేదు.
దీంతో ఏ నియోజకవర్గం నుంచి తనుకు టికెట్ హామీ ఇస్తారో క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీ మారితే బాగుంటుందనే ఆలోచనలో ఆమె ఉన్నారట.ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపిలో సరైన గుర్తింపు లేక ప్రాధాన్యం దక్కని నేతలు చాలామంది ఇప్పుడు టిడిపి వైపు చూస్తూ ఉండడం వైసిపిలో ఆందోళన పెంచుతోంది.







