సూర్యాపేటలో కేసీఆర్, జగదీష్ రెడ్డిపై విరుచుకుపడ్డ షర్మిల

తాగేటోడు ముఖ్యమంత్రి మందు కలిపేటోడు మంత్రి.ఎనిమిదేళ్ళ పాలనలో వీళ్ళు చేసిందేమీ లేదు.

 Sharmila Lashes Out At Kcr And Jagdish Reddy In Suryapet-TeluguStop.com

పైన పటారం,లోన లొటారంలా ఉంది సూర్యాపేట పట్టణం.తాగుబోతు తాగి పండినట్లుగా ఉంది వీళ్ళ పాలన తీరు.

మీకు దమ్ముంటే ఒక సవాల్ ను స్వీకరించండి.నాతో పాదయాత్రకు రావాలి.

సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్ళిపోతా.సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయండి.

ప్రశ్నించాల్సిన ప్రతి పక్షం కేసీఅర్ సంకన ఎక్కింది.పార్టీ మారి రాజకీయ వ్యభిచారనికి పాల్పడుతున్నారు.బీజేపీ మత పిచ్చి రేపుతోంది.2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసింది.నా గుండెలో నిజాయితీ ఉంది.మీకు సేవ చేయాలని తపన ఉంది.వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్ళీ మీ చేతుల్లో పెడతానని మాట ఇస్తున్న.వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ కావాలి అంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావాలి.

-వైఎస్ షర్మిల

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట నియోజకవర్గంలో మహాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల బుధవారం సాయంత్రం సూర్యాపేట పట్టణానికి చేరుకున్న సందర్భంగా జిల్లా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సూర్యాపేట గాంధీ చౌక్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.వైఎస్ షర్మిలకు పేటలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

సభలో వైఎస్సార్ టిపి రాష్ట్ర నాయకులు,ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ఆలపించిన పాటలు ఆహుతులను అలరించాయి.ఈ సందర్భంగా వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్.

షర్మిల సభికులనుద్దేశించి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై,ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.భీంరెడ్డి నరసింహరెడ్డి,రావి నారాయణరెడ్డి,మారోజు వీరన్న,చాకలి ఐలమ్మ,బెల్లి లలితమ్మ లాంటి ఎంతో మంది వీరులను కన్న గడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాకు మీ వైఎస్సార్ బిడ్డ వచ్చిందని ఆశీర్వదించిన ఈ గడ్డకు,ఈ ప్రజలకు వందనాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

వైఎస్సార్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపించారని, ఇదే నల్గొండ జిల్లాలకు 33 సార్లు సీఎం హోదాలో వచ్చారని గుర్తు చేశారు.అంటే ఈ జిల్లాపై వైఎస్ఆర్ కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్ దే అన్నారు.

నల్లగొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్థాపించి ఎంతోమంది విద్యార్థుల కలలను సాకారం కావడానికి కృషి చేశారని తెలిపారు.మరి కేసీఅర్ 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ గడ్డకు ఏం చేశారని ప్రశ్నించారు.

సూర్యాపేట పట్టణం పైన పటారం లోన లోటారంలా ఉందని,స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి రెండు సార్లు మంత్రి అయ్యారని,ఎలా మంత్రి అయ్యాడో తెలుసా అని సభికులను అడిగారు.తాగేటోడు ముఖ్యమంత్రి అయితే,మందు కలిపేటోడు మంత్రి అయ్యాడని,తాగుబోతు తాగి పండినట్లుగా వీళ్ళ పాలన తీరు ఉందని ఎద్దేవా చేశారు.

స్కూటర్ మీద తిరిగే జగదీష్ రెడ్డి 5 వేల కోట్లు ఎలా సంపాదించాడన్న షర్మిల,అన్ని మాఫియాలు, దందాలు,కాంట్రాక్ట్ లు మొత్తం ఆయన బినామీలవేనని ఆరోపించారు.అవినీతి గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు,జైళ్లు ఉద్యోగాలు పీకడం,భయబ్రాంతులకు గురి చేయడమేనన్నారు.

ఇసుక మాఫియా ఈయనదే,దందాలు ఈయనవే, చెరువులు,అసైన్డ్ భూములు,ప్రభుత్వ భూములు వదిలి పెట్టడటగా,చెరువులు కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటడటగా,కలెక్టరేట్ ఈయన స్వార్థం కోసం ఎక్కడికో తీసుకు వెళ్ళారటగా,ఈయన మాట చెప్పనిదే చీమ కూడా కదలదటగా అన్నారు.సూర్యాపేటకు పరిశ్రమలు వచ్చాయా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు కావాలని అడిగితే ఇచ్చారా?కోల్డ్ స్టోరేజ్ లు కావాలని అడిగారు ఇచ్చారా? స్పిన్నింగ్ మిల్స్ కావాలని అడిగారు ఇచ్చారా?యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంత వరకు ఎందుకు పూర్తి కాలేదు?ఈయన ఇప్పుడు విద్యుత్ మంత్రి,కరెంట్ బిల్లులతో షాక్ కొట్టిస్తున్నారని దుయ్యబట్టారు.13 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థల నుంచి బిల్లులు రావాలి,కానీ,మంత్రికి అడిగే దమ్ములేదు,ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి 6 వేల కోట్ల బకాయిలను మాత్రం వసూలు చేస్తున్నారని అన్నారు.ఓటు అనేది తల్లి లాంటిది,బిడ్డ లాంటిది ఎవరూ అమ్ముకోకుడదన్నారు.

కేసీఅర్ మోసంచేయని వర్గం ఎదైనా ఉందా?ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా?ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా?వరి వేస్తే ఉరి అనే సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా ఉండడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వ్యవసాయానికి 30 వేలు లబ్ది చేకూరే పథకాలను బంద్ పెట్టారు,ముష్టి 5 వేలు రైతుబంధు ఇస్తే రైతులు కార్లలో తిరుగుతూ కోటీశ్వరులు అవుతారా? అని ప్రశ్నించారు.రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండి,నోటిఫికేషన్లు ఇచ్చారా? కిరాతకునికి తల్వార్ ఇస్తే తల నరికినట్లు,కేసీఅర్ కు అధికారం ఇచ్చినట్లు అయ్యిందని,పదవులు ఆశ కలగగానే కేసీఅర్ కుటుంబం మొత్తం దిగిందన్నారు.తెలంగాణ బిడ్డలు మాత్రం ఉద్యోగాలు లేక కూలి పనులకు పోవాలి,లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తే,20 వేలు అని 30 వేలు అని బేరసారలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లుగా గత ప్రభుత్వాలు కూడబెట్టి ఇస్తే ఈ పాలకులు 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని ఆగం పట్టించారన్నారు.ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా బీడీ బిచ్చం,కళ్ళు ఉద్దేరలా మారిందన్నారు.

రాజీవ్ స్వగృహ వైఎస్సార్ మధ్య తరగతి ప్రజల కోసం ఇస్తే,ఇప్పుడు కేసీఅర్ ఆ భూములను అమ్ముకుంటున్నారని,దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు మొత్తం అమ్ముకు పోతున్నాడని ఇదేనా బంగారు తెలంగాణ? మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకు పోయాడట అట్లుంది కేసీఆర్ పాలన అని ఎద్దేవా చేశారు.బంగారు తెలంగాణ అని చెప్పి,బీర్ల తెలంగాణ,బార్ల తెలంగాణ చేశారని,గుడులు, బడులు కన్నా బెల్ట్ షాపులు ఎక్కువగా ఉండి, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు.

టీఆర్ఎస్ ఎకౌంట్ లో మాత్రం 860 కోట్లు ఉందట,వడ్డీ మూడు కోట్లు వస్తుందట,అందుకే బంగారు తెలంగాణకు బదులు బంగారు టీఆర్ఎస్ పార్టీ అయ్యిందేమో అన్నారు.ఆయన సొంతపనులకు ప్రజల సొమ్మే వాడుకుంటున్నారు.100 కోట్ల విలువ జేసే భూమిని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం కట్టబెట్టారు.ఆయన పార్టీ అకౌంట్ లో అంత డబ్బు ఉంటే ఎందుకు కొనుక్కోవడం లేదు? కేసీఅర్ కొనుక్కొనే మనిషి కాదు.లాక్కునే మనిషి అన్నారు.ఆయన పార్టీ డబ్బులు ముట్టుకోరు,ప్రజల డబ్బులు మాత్రం విచ్చలవిడిగా వాడుకుంటారని అన్నారు.కాంట్రాక్ట్ ల పేరు చెప్పి కమీషన్లు తీసుకుంటారు.ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు గాడిదకు రంగు పూసి అవు అంటాడు.

అది నమ్మి ఓట్లేస్తే తెలంగాణను ఇంకెవరూ కాపాడలేరని చెప్పారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిందని,ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టే పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube