కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ కడతానని చెప్పారు.ఢిల్లీలో గత్తర లేపుతానని హెచ్చరించారు.
చివరికి కాంగ్రెస్ బలపరుస్తున్న రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.రాహుల్ గాంధీతో కలిసి కేటీఆర్ ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కు హాజరయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ తో కుస్తీ అంటారు.ఢిల్లీ వెళ్ళి దోస్తీ చేస్తారు.ఇంతకీ గులాబీదళపతి కేసీఆర్ కాంగ్రెస్ కు అనుకూలమా? వ్యతిరేకమా?కాంగ్రెస్, బీజేపీలకు దేశాన్ని పాలించడం చేతకాలేదని, అన్ని వనరులున్నా దేశాన్ని బాగు చేయలేకపోయారని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటారు.2018లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగినప్పటి నుంచీ ఆయన పాడుతున్న పాట ఇదే.ఎన్నికలు కాగానే ఢిల్లీలో చక్రం తిప్పుతానని కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని బహిరంగంగానే చెప్పారు.అయితే ఎన్నికలు మూడున్నరేళ్ళయింది.
ఆ మధ్య ఓసారి ఫెడరల్ ఫ్రంట్ గురించి ఎప్పుడు చెప్పానంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు కేసీఆర్.రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందన్న విషయం అర్థం కావడంతో మరోసారి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా చర్చ సాగింది.టీఆర్ఎస్ కార్యవర్గంలో దీనిపై సీరియస్ గానే చర్చించారు.
ఢిల్లీ వెళ్ళి ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు ప్రతిపక్ష నేతల్ని కలుసుకున్నారు.గతంలో చెన్నయ్ వెళ్ళారు.
బెంగళూరు వెళ్ళారు.యూపీ, బిహార్ ప్రతిపక్ష నేతలు వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్.ఆత్మహత్యలు చేసుకున్న పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం కూడా చేసి వచ్చారు.
అయితే బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలు గాని.కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు గాని కేసీఆర్ ను నమ్మి వచ్చేందుకు ఇష్టంగా లేవు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు ఉన్న క్రేజ్ అలాంటిది.ముఖ్యమైన పార్టీలేవీ కూడా తనతో కలిసి రావడానికి సిద్ధంగా లేవని గ్రహించిన కేసీఆర్ కొంతకాలంగా మళ్ళీ సైలెంట్ గా ఉన్నారు.
రాష్ట్ర్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, ఆదివాసీ మహిళా నేత ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కలిసి మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశారు.ఢిల్లీలో యశ్వంత్ సిన్హా నామినేషన్ వేస్తే టీఆర్ఎస్ తరపున ఎంపీలను వెంట తీసుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ వెళ్ళారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంతకీ కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలు రెండింటినీ వ్యతిరేకిస్తున్నరా? కేవలం బీజేపీని మాత్రమే వ్యతిరేకిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ…ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారా? బీజేపీ నాయకులు వేస్తున్న ఈ ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెబుతారా? కేసీఆర్ నిజంగా కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకిస్తున్నట్లయితే…ఆయనకు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడానికి ఎందుకు ప్రయత్నించలేదు.విజయం ఎలాగూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముదే.అందులో ఎలాంటి సందేహమూ లేదు.
ప్రతిపక్ష అభ్యర్థి ఎవరైనా ఓటమి తప్పదు.ఈ విషయం పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు తెలుసు.
కసీఆర్ తో సహా ఆయన్ను బలపరుస్తున్న ప్రతిపక్షాలకు తెలుసు.అటువంటపుడు కేసీఆర్ తన అభ్యర్థిని నిలిపి జాతీయ రాజకీయాల్లో తనవెంట వచ్చేది ఎవరో తెలుసుకోవచ్చు కదా? మంచి అవకాశాన్ని కేసీఆర్ ఎందుకు జారవిడుచుకున్నారు? కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థికి ఎందుకు మద్దతిస్తున్నారు? కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఇంతకీ గులాబీ దళపతి కాంగ్రెస్ కు అనుకూలమా? వ్యతిరేకమా?
.






