ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది.రాజకీయ పార్టీ ఏదైనా ఈ విషయంలో అందరికీ ఒకే నియమం వర్తిస్తుంది.
అలా కాదని అస్మదీయులకే లబ్ధి చేకూరిస్తే ప్రజల నుంచి వచ్చే స్పందన మరోలా ఉంటుంది.కానీ ఏపీలో జగన్ అందరినీ సమానం చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూములు లీజుకిచ్చిన రైతులను నెత్తిన పెట్టుకుంటామని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు దాదాపు 66వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని.ఈ ప్రాజెక్టు భూములకు సంబంధించి ఎకరానికి ఏడాదికి రూ.30 వేలు ఇచ్చే విధానం తీసుకువస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.అంతేకాకుండా రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుందని జగన్ వివరించారు.ఎందుకంటే బీడు భూములను లీజు విధానంలో తీసుకుని ఏటా ఎకరాకు దాదాపు రూ.30 వేలు చెల్లించేలా నూతన విధానం తీసుకువస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
అయితే జగన్ ప్రకటనను అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తప్పుబడుతున్నారు.గ్రీన్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారిని ఒకలా.తమను మరోలా జగన్ ట్రీట్ చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.బీడు భూములకే ఏడాదికి 30 వేల చొప్పున కౌలు చెల్లిస్తామని ప్రకటించిన జగన్ రాజధాని అమరావతి కోసం పచ్చటి పంట పొలాలను ఇచ్చిన రైతులకు న్యాయం చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వానికి అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూమిని అప్పగించారని.మరి వీరు రైతులు కారా? వీరివి త్యాగాలు కావా? అని పలువురు జగన్‌ను నిలదీస్తున్నారు.కాగా రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరికి చెందిన పోతినేని శ్రీనివాసరావు అనే రైతు ప్రభుత్వంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.జగన్ సర్కారుకు కోర్టు నోటీసులు జారీ చేసింది.







