ఎస్సీ వర్గీకరణ చేయకపోతే బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటాం.ఎనిమిదేళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ మోసం చేస్తుంది.
జులై 2న మాదిగల ఆవేదన ఆక్రోశం పెల్లుబికనుంది.ఎస్సీ వర్గీకరణ చేయకపోతే బీజేపీ తగిన మూల్యం చెలించుకుంటుంది-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ.
యాదాద్రి జిల్లా:ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఇక బీజేపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన సంగ్రామ పాదయాత్ర బుధవారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామం నుండి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 25 సంవత్సరాల నుండి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ,ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయినా ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు.కేంద్రంలోని మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక బిల్లులను లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకున్నారు.
కానీ, తమ మ్యానిఫెస్టోలో పెట్టిన ఎస్సీ వర్గీకరణను ఎందుకు చేపట్టడం లేదన్నారు.బీజేపీకి ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
జులై 2 న తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీకి మాదిగల ఆవేశం,ఆక్రోశం కనిపించనుందని తెలిపారు.బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా జూలై 2న ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా జాతీయ రహదారి దిగ్బంధం చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఇప్పటికైనా మోదీ సర్కార్ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని లేనిపక్షంలో మాదిగల ఆవేశానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.







