భారత ప్రథమ పౌరుడి ఎన్నికల నగరా మోగింది.రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ భావిస్తోంది.
అందుకోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించింది.ఇక కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
అదే సమయంలో తెలంగాణ కేసీఆర్ నిర్నయం కూడా కీలకం కానుంది.కేంద్రం మీద కారాలు మిరియాలు నూరుతున్న కేసీఆర్ ఏకగ్రీవానికి సహకరిస్తారా? పోటీ ఉండాల్సిందే అంటారా?.
దేశంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో చెప్పాలంటే ఎన్నికలు రావాలి.ఏ ఎన్నికలు జరిగినా అధికార, విపక్ష కూటముల్లో ఎవరెవరు ఉంటారో తేలిపోతుంది.ఇప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది.రాష్ట్రపతి ఎన్నిక చరిత్రలో అనేక సార్లు ఏకగ్రీవంగానూ ముగిసింది.
ద్విముఖ పోటీ, త్రిముఖ పోటీ జరిగిన చరిత్రా ఉంది.అయితే ఈసారి ఎన్నిక ఎలా ఉండబోతోంది? అన్ని పార్టీలూ ఆమోదించేవిధంగా అభ్యర్థిని నిలిపి ఏకగ్రీవం చేయాలని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు.ఏకగ్రీవానికి అవకాశం ఉండే పలువురి పేర్లనూ పరిశీలిస్తున్నారు.తమకు ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని బీజేపీ నాయకత్వం సూచిస్తే కాంగ్రెస్ ఏకగ్రీవానికి సహకరించవచ్చు.అయితే కేంద్రం మీద దండయాత్ర చేస్తానంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుందన్నదే కీలకం కాబోతోంది.
ఏకగ్రీవం కాకుండా పోటీ జరిగినా బీజేపీ దాని మిత్రపక్షాలకు సొంతంగా రాష్ట్రపతిని గెలిపించుకోగల శక్తి ప్రస్తుతానికి లేదు.
మెజారిటీకి అడుగు దూరంలో ఉన్నారు కమలనాథులు.అయితే NDA బయట ఉన్న మిత్రులు ఓటేస్తే బీజేపీ అభ్యర్థి విజయానికి ఢోకా లేదు.
ఇక్కడ ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం బీజేపీకి వ్యతిరేకం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.ఏపీ సీఎం జగన్ ఇటీవలే ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికల విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.బీజేపీకి అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్న వైసీపీ నాయకత్వం రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వ్యతిరేకిస్తుందని భావించాల్సిన అవసరం లేదు.
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ లో బీజేపీ దాని మిత్రపక్షాలను కలుపుకుంటే అంటే ఎన్డీఏ కూటమికి 49 శాతం ఓట్లున్నాయి.ఎన్డీఏ కూటమికి బయట ఉన్న వైసీపీకి ఉన్న ఓట్లను కలుపుకుంటే దాదాపు 5 శాతం ఓట్లు కలుస్తాయి.
ఇక బీజేపీ అభ్యర్థి విజయానికి ఎదురే ఉండదు.

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ అనేక పార్టీల నేతలను కలుస్తున్నారు.అయితే ఎవరి నుంచీ సరైన స్పందన రాలేదంటున్నారు.కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీల నేతలనే కేసీఆర్ కలుస్తున్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక్కరే కాంగ్రెస్ కూటమి బయట ఉన్నారు.బెంగాల్ సీఎం బీజేపీని వ్యతిరేకిస్తున్నా ఇప్పటి పరిస్థితుల్లో కేసీఆర్ మాట వింటారని అనుకోలేము.
కాని త్వరలో ఢిల్లీలో లేదా హైదరాబాద్ లో తనతో కలిసివచ్చే వారితో సమావేశం ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.అసలు కేసీఆర్ తో కలిసివచ్చేవారెవరు? వారికి ఉన్న బలం ఎంత? ఒక వేళ కేసీఆర్ మిత్రులంతా కలిసి అభ్యర్థిని నిలిపినా నామమాత్రపు పోటీ తప్ప మరేమీ కాదు.మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.







