నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో యాష్ ప్లాంట్ సాంకేతిక లోపాలతో కూలిపోలేదని…దురుద్దేశంతో కూల్చి వేయడం జరిగిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి సిపిఎం సిపిఐ అఖిల పక్ష మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నష్టాల్లో చూపించి.అధాని కంపెనీలకు అప్పగించేందుకే యాష్ ప్లాంట్ కూల్చివేత వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
యాష్ ప్లాట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడుదేనని,యాష్ ప్లాంట్ కూలిపోవడానికి కారణం కూడా మంత్రి అనుచరుడేనన్నారు.దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం అధాని కి అప్పగించడంపై కార్మికులు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిలదీస్తే… మంత్రి స్థాయిలో వెటకారంగా సమాధానం చెప్పడం దేనికి నిదర్శనమని ఆయన ప్రశ్నించారు.
నిర్లక్ష్యాన్ని విడనాడి విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన మూడు యూనిట్లను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల కోడ్ ఉండడంతో ఉద్యమాలు చేయలేకపోతున్నామని.విద్యుత్ కేంద్రంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన పక్షంలో తదుపరి కార్యాచరణ వేగవంతం చేస్తామన్నారు.







