తెలుగుదేశం పార్టీలో చేరిన అతికొద్ది కాలంలోనే ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఎదిగిన సినీనటి దివ్యవాణి.ఆ పార్టీ అధికార ప్రతినిధి గా కొనసాగుతున్నారు.
ఏపీ అధికార పార్టీ వైసీపీ పై దూకుడుగా విమర్శలు చేస్తూ, టిడిపి తరఫున బలంగా గొంతు వినిపించే వారు.ఇక చంద్రబాబు సైతం ఆమెకు ప్రాధాన్యం బాగానే ఇచ్చేవారు.
అమరావతి పోరాటం వ్యవహారంలోనూ దివ్యవాణి చురుగ్గా పాల్గొంటూ, టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించేవారు.అయితే ఆ పార్టీలో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఆకస్మాత్తుగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఇందులో తన రాజీనామాకు గల కారణాలను ఆమె వివరించారు.
తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయం ని వ్యతిరేకిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఇప్పటి వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఆమె వ్యాఖ్యానించారు.
దీంతో అసలు దివ్యవాణి విషయంలో పార్టీ లో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది.కొద్ది రోజుల క్రితమే ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె టిడిపి పై అనేక ఆరోపణలు చేశారు.
తనకు మహానాడులో అవమానం జరిగిందని , టిడిపి కి తాను నిస్వార్థంగా పని చేస్తున్నానని , అయినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, , ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో తనలాంటి కళాకారులను పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితికి బాధ కలుగుతోంది అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు .

పార్టీలో తాను ఇప్పటివరకు ఎటువంటి అధికారం లేని అధికార ప్రతినిధిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.తనకు సీఎం జగన్ పైన కానీ , మాజీ మంత్రి కొడాలి నాని తో కానీ ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఆమె వ్యాఖ్యానించారు .ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆమె వైసీపీలో చేరేందుకు ప్లాన్ వేసుకున్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన వెంటనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఆమెకు ఫోన్ చేసి తమ పార్టీలో చేరవలసిందిగా కోరినట్లు సమాచారం.







