అమెరికా.శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.
అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.
ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.ఇందులో భారతీయులు సైతం వున్నారు.
అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.
అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.ఈ తరం పిల్లలు చిన్నతనం నుంచే అమెరికా గోల్‌ను పెట్టుకుని అందుకు అనుగుణంగా శ్రమిస్తున్నారు.ప్రభుత్వాలు సైతం ఉన్నత విద్య కై అమెరికా వెళ్లే వారి కోసం పలు పాలసీలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇలాంటి వారందరికీ శుభవార్త చెప్పింది క్వాడ్ .అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ దేశాల కూటమే ఈ క్వాడ్.ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో భాగంగా కీలక ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా విద్యార్థులు యూఎస్‌లో చదువుకునేందుకు వీలుగా ‘క్వాడ్ ఫెలోషిప్’ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు.క్వాడ్ ఫెలోషిప్ పొందే విద్యార్థులు అమెరికాలో చదువుకోవచ్చు.అయితే ఈ నాలుగు దేశాలకు చెందిన కేవలం వంద మంది విద్యార్థులకు మాత్రమే ఇందులో అవకాశం కల్పిస్తారు.

గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లకు గాను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు.18 ఏళ్లు నిండిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా నివాసితులు దీనికి అర్హులు.బ్యాచిలర్స్ డిగ్రీ లేదా 2023 ఆగస్టు నాటికి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో తత్సమాన విద్యార్హత ఉండాలి.
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అకడమిక్స్‌లో మంచి మెరిట్ సాధించి ఉండాలి.మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేస్తున్న వాళ్లు కూడా దరఖాస్తుకు అర్హులే.అభ్యర్ధులు ముందుగా క్వాడ్ ఫెలోషిప్ వెబ్‌సైట్‌లో తమ అర్హతల గురించి రివ్యూ చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేయాలి.
జూన్ 30వ తేదీ వరకు ఫెలోషిప్ దరఖాస్తులను స్వీకరిస్తారు.ఈ ఏడాది జూలై-అక్టోబర్ మధ్యకాలంలో దరఖాస్తులను పరిశీలిస్తారు.
అక్టోబర్‌లో సెలక్షన్ జరుగుతుంది.ఆగస్టు 2023లో ఫెల్లోషిప్ ప్రోగ్రామ్ … 2024 వేసవిలో సీనియర్ ఫెల్లోషిప్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది.







