యాదాద్రి జిల్లా:కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్.ఎం.
ఎం.ఎస్ డైరెక్షన్స్ ను,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ నెం:333 ను తక్షణమే రద్దు చేయాలని,క్యూబిక్ మీటర్ కొలతలను రద్దు చేసి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.మంగళవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో అమలౌతున్న సమ్మర్ అలవెన్సును రద్దు చేసి కూలీల పొట్ట కొట్టిందని అన్నారు.
ఇప్పుడేమో పని ప్రదేశంలో ఉదయం,సాయంత్రం రెండు సార్లు కూలీల ఫోటోలు స్మార్ట్ ఫోన్స్ ద్వారా మేట్ మస్టర్ అప్ లోడ్ చేస్తేనే వేతనాలు బ్యాంకు ఎకౌంట్లలోకి వేస్తామనటం చట్టవ్యతిరేకమైన చర్యని విమర్శించారు.ఈ విధానంతో స్మార్ట్ ఫోన్స్ లేని,డేటా రీచార్జీ చేసుకోలేని,చదువు లేని,రిమోట్ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులను,దళితులు,ఇతర పేదలను పనికి దూరం చెయ్యడమే మోడీ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తుందని మండిపడ్డారు.
పని చేయగలిగిన ప్రతి ఒక్కరికీ పని చూపాలని చట్టం చెప్పిన మౌళికాంశాన్ని అమలు చేయకుండా,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోజూస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానం కూలీల పని హక్కును హరించే చర్యగా ఉన్నదని అన్నారు.ఇప్పటికే కొలతల పేరుతో రూ.120,రూ.150 అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని,వారంలో చెల్లించాలిసిన వేతనాలు, నెలలు తరబడి పెండింగ్ లో పెట్టారని,చట్ట ప్రకారం పనిముట్లు,నీడకు టెంట్,త్రాగునీరు,ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వకుండా ఆపడం వలన కూలీలు ఉపాధి హామీ పనులకు రావడానికి సిద్ద పడకుండా చేయడమేనని ఆరోపించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కొత్త నిర్ణయం వలన పేదలు తమంతట తామే పనికి దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే ఈ మస్టర్ అమలు కోసం తెచ్చిన సర్క్యులర్ నెం:333 ను,క్యూబిక్ మీటర్ విధానాన్ని రద్దు చెయ్యాలని,అదేవిధంగా ఎన్.ఎం.ఎం.ఎస్ అమలు చెయ్యమని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం లేఖ రాయాలని డిమాండ్ చేశారు.వడపర్తి గ్రామంలో ఉపాధి కూలీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని,వారం వారం పే స్లిప్ లు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని,రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని,వ్యవసాయ కూలీలకు,ఉపాధి హామీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షలు కల్పించాలని,పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని కోరారు.వీటి సాధన కోసం వ్యవసాయ కూలీలు,జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు,పేదలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు పాండాల మైసయ్య, సహాయ కార్యదర్శి కొండపురం యాదగిరి,గ్రామ నాయకులు ఉద్దమారి సంజీవ,సిల్వర్ కృష్ణమౌళి, ఉపాధి కార్మికులు మూడుగుల సరళ,మేడబోయిన మంజుల,జిన్న పద్మ,తుమ్మల భాలలక్ష్మి,సోమవారం నాగమణి,మేడబోయిన లలిత,బాలమ్మ,లక్ష్మి, స్రవంతి,ఎల్లమ్మ,ఉష,యాదమ్మ,శోభ,అండాలు, కలమ్మ,సక్కుబాయి,రజియా తదితరులు పాల్గొన్నారు.