ఏపీలో ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్ల సమయం ఉంది.కానీ ఇప్పటి నుంచే ఎన్నికల వేడి రాజుకుంది.
ప్రస్తుతం పొత్తుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది.టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.
అయితే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు.తాము పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వకపోయినా వైసీపీ ఎందుకు భుజాలు తడుముకుంటోందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల నుంచి మీడియాను మరల్చడానికే ఇది వైసీపీ వేసిన ఎత్తుగడ అని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఎవరు పొత్తు పెట్టుకుంటారు? ఎవరు గెలుస్తారు? అన్న సంగతి కాసేపు పక్కనపెడితే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వస్తున్న ఆరోపణలపై స్పష్టత కరువైంది.రాష్ట్ర విభజన నాటికే ఏపీకి లక్షల కోట్ల అప్పులు మిగిలాయి.టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు పెరిగాయే తప్ప తరగలేదు.
తాము రాష్ట్రాభివృద్ధి కోసమే అప్పులు చేశామని అప్పట్లో టీడీపీ వివరణ కూడా ఇచ్చింది.

అయితే ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో అప్పులు మూడింతలు పెరిగాయి.పోనీ అభివృద్ధి ఏమైనా జరిగిందంటే దాని గురించి మాట్లాడుకోవడమే దండగ అన్న చందాన పరిస్థితి ఉంది.సంక్షేమ పథకాల కోసం జగన్ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేస్తున్నారు.
టీటీడీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటోంది.చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే జగన్ దిగిపోయేనాటికి అప్పులు రూ.11 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా.
ఏపీలో ఐటీ సెక్టార్ లేదు.
పరిశ్రమలు వచ్చే పరిస్థితులే కనిపించడం లేదు.

పరిశ్రమలు రానప్పుడు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్న మాటలకు అవకాశమే లేదు.మరి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని బాగుచేసేది ఎవరు అన్న విషయం అంతుచిక్కడం లేదు.పోనీ వచ్చే ఎన్నికలు మళ్లీ వైసీపీ గెలిచినా అప్పులు తగ్గుతాయని ఆశించలేం.
ఒకవేళ ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీని రిపేర్ చేయడం చాలా కష్టమే.
ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.