యాదాద్రి జిల్లా:ఒకవైపు నిరసనలు,మరోవైపు భక్తుల ఇక్కట్లు,ఇంకోవైపు ఆలయ ఈఓ ఏకపక్ష నిర్ణయాలు వెరసి రోజుకో సమస్యతో యాదగిరిగుట్ట ఉద్రిక్తతలకు నిలయంగా మారింది.పున:ప్రారంభం నుండి యాదాద్రి కొండపై జరిగే నిత్య పూజల కంటే నిరసనలే ఎక్కువ హల్చల్ చేశాయి.ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఈవో గీతారెడ్డి లాంగ్ లీవ్లో వెళ్లడం,ఆలయ ఇంచార్జ్ ఈవోగా రామకృష్ణను నియామకం చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఆలయ ఈఓ గీతారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ వెనక ఏదో జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతుంది.
ఇటీవలి కాలంలో గీతారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి.రెండు రోజుల క్రితం యాదాద్రి గుట్టపై వాహనాల పార్కింగ్ ఛార్జీలు రూ.500కి పెంచడంపై ప్రభుత్వం గీతారెడ్డి పట్ల సీరియస్ అయినట్లు తెలుస్తోంది.ఈ నెల 6న గీతారెడ్డి కుమార్తె వివాహం జరగనున్నట్లు,కుమార్తె వివాహం కారణంగానే గీతారెడ్డి లాంగ్ లీవ్‌లో వెళ్లినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంచార్జి ఈవోను నియమించినట్లు చెబుతున్నారు.ఇంచార్జ్ ఈవోగా నియమించబడిన రామకృష్ణ ప్రస్తుతం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.మే 2 సోమవారం ఉదయం రామకృష్ణ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని,ఆలయ ఇంచార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.యాదాద్రి గుట్టపై వాహనాల పార్కింగ్ ఫీజును భారీగా పెంచిన సంగతి తెలిసిందే.ఫోర్ వీలర్ వాహనాలకు మొదటి గంటకు రూ.500 చొప్పున,ఆ తర్వాత ప్రతీ గంటకు అదనంగా రూ.100 చొప్పున పార్కింగ్ ఫీజుగా నిర్ణయించారు.అయితే ఈ నిర్ణయంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పార్కింగ్ ఫీజును రద్దు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్కింగ్ ఫీజు పెంపుపై ఇటీవల వివిధ పత్రికలలో వచ్చిన కథనాలపై స్పందించిన ప్రభుత్వం యాదాద్రి ఈవో గీతా రెడ్డిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఆమె లాంగ్ లీవ్లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ఇది యాదృచ్చికమా లేక ఏదైనా మతలబు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.







