ఖమ్మం జిల్లా రఘునాథపాలెం , జింకలతండా గ్రామస్తులు, నిరుపేద యస్ టి కులానికి చెందిన రైతులు రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ నాథ్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు .మా యొక్క తాత , తండ్రుల నుండి సంక్రమించినటువంటి ఎసైన్డ్ పట్టా భూములను మేము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని , అటువంటి పరిస్థితులలో మా యొక్క భూములను, ప్రభుత్వం రకరకాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా స్వాధీనం చేసుకుంటున్నారని,ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయం చూపెడతారనే ఆశతో మేము ఇన్ని రోజులు వేచి చూస్తున్నామని, కానీ రోజులు గడుస్తున్నా కొద్ది మాకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందకపోవడంతో విచారించి మీదగ్గరకొచ్చామనీ అన్నారు .
ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా వలన మేము నేటి వరకు మాట్లాడకుండా ఉన్నామని తెలిపారు .భూములను ప్రభుత్వం తీసుకుంటున్న దృష్ట్యా మాకు ప్రత్యామ్నాయంగా చూపించాలన్నారు .మాకు సహాయం చేసి మాకు న్యాయం చేయగలరని కోరారు .గతంలో ఈ విషయం పై మంత్రి ని కలిశామని, అప్పుడు వారు ఎవరు భూములు పోతున్నాయో వారికి ప్రత్యామ్నాయం చూపించమని అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు .గతంలో ఉన్న రఘునాథపాలెం ఎమ్మార్వో తిరుమలరావుని కూడా కలిశామని సానుకూలంగా స్పందించి చేద్దాం చూద్దాం అని అన్నారు .ఆ తర్వాత కి వారు మరోచోటకి బదిలీ మీద వెళ్లిపోయారని తెలిపారు .ఇప్పుడు ఉన్న రఘునాథపాలెం తహసీల్దారు నరసింహారావు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కావున వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో అంగోత్ మంగ్యా , నాగేశ్వరరావు , బానోత్ కూనా, చల్లా వెంకటేశ్వర్లు , గమస శేషయ్య , బోడ శంకర్ , బాణోత్ కృష్ణ, బోడా సోమ్లా, బోడ వీరన్న , బోడ నాగరాజు , చల్లా నర్సయ్య , తులసి , సాలిక్ , సరోజా తదితరులు పాల్గొన్నారు.







