భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కాశ్మీర్ ఒకటి.దేశ, విదేశాల నుండి అనేక మంది పర్యాటకులు కశ్మీర్ అందాలని చూడడానికి తరలి వస్తూ ఉంటారు.
కాశ్మీరును ప్రకృతి ప్రేమికులు “భూతల స్వర్గం” అని అంటారు.ఈ ప్రాంతం నిజంగానే అక్కడకి వచ్చే వారిని సులభంగా ఆకట్టేసుకుంటుంది.
రమణీయమైన ప్రకృతితో ఎంతో శోభాయమానంగా ఉంటుంది.మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే అన్నారట.
కాశ్మీర్‌కు వెళ్లి ప్రత్యక్షంగా ఆ ఫీల్‌ను అనుభవించాలే తప్పించి.వర్ణించడం ఎవరి తరం కాదు.
అయితే వేర్పాటు వాదం, ఉగ్రవాదులు, సైనిక చర్యల కారణంగా నాలుగు దశాబ్ధాల నుంచి కాశ్మీర్‌కు పర్యాటకుల రాక బాగా తగ్గిపోయింది.అక్కడికి వెళితే ప్రాణాలతో చెలగాటమేనన్న భయం ఇప్పటికీ దేశ ప్రజలను వెంటాడుతోంది.
అయితే కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఇప్పుడిప్పుడే పరిస్ధితులు కుదటపడుతున్నాయి.సంక్షోభిత జమ్మూకాశ్మీర్‌లో శాంతి పవనాలు వీస్తున్నాయి.ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పడుతుండగా.ప్రజలు కూడా పరిస్ధితులకు అలవాటుపడుతున్నారు.
సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను ఏరివేయడం.ఆయుధాలు, నిధులకు అడ్డుకట్ట వేయడంతో ముష్కరుల ఆట సాగడం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో గతంలో కాశ్మీర్‌ను విడిచి వెళ్లిపోయిన కాశ్మీరీ పండిట్లు కూడా తిరిగి వెనక్కి వచ్చేయాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ను అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తానని అమెరికాకు చెందిన కాశ్మీరీ వైద్యుడు కంకణం కట్టుకున్నారు.దక్షిణ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ తన్వీర్ పడ్డర్ అనే వైద్యుడు అమెరికాలో స్థిరపడ్డాడు.ఆయన తన రాష్ట్రం కోసం Kashmironline.com అనే వెబ్‌సైట్ ప్రారంభించాడు.
అందాల కాశ్మీర్‌పై నిత్య సంఘర్షణ ప్రదేశమనే ముద్ర వేయడంతో బాధపడ్డ ఆయన.కాశ్మీర్ వెళ్లాలనుకునే ఉన్నతస్థాయి పర్యాటకులకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించే ఉద్దేశ్యంతో ఈ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు .
కాశ్మీర్‌పై ఒక వర్గం పత్రికలు, మీడియా నెగిటివ్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.తన వెబ్‌సైట్‌లో హోటళ్లు, హౌస్‌బోట్‌లు, రవాణా, కళాకారులు, పండ్ల పెంపకందారులు, వర్థమాన పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో వుంచినట్లు తన్వీర్ చెప్పారు.