అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరిగాయని తెలుసుకుని వామ్మో అనుకుంటాం.పట్టాలు తప్పిన రైలులో చాలా మంది ప్రమాదంలో గాయపడతారు.
కొన్ని ఘటనల్లో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం కూడా ఏర్పడుతుంది.సాధారణంగా ఇలాంటివి రైల్వేస్టేషన్లకు దూరంగా, మనుషులు లేని ప్రాంతాల్లో జరుగుతుంటాయి.
అలాంటి ప్రమాదాలు రైల్వేస్టేషన్లలో జరుగుతాయని ఎప్పుడైనా ఊహించారా? రైళ్ల కోసం ఎదురు చూస్తుండగా ప్లాట్‌ఫాం మీదకు రైలు వస్తుందని కలలోనైనా అనుకున్నారా? నిజంగానే ఇది జరిగింది.ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా, చాలా మందికి గాయాలు అయ్యాయి.
చెన్నైలోని బీచ్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఓ ఊహించని ప్రమాదం ఎదురైంది.రైలు కోసం ప్లాట్ ఫాంపై ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.ఇంతలో ఓ సబర్బన్ రైలు వేగంగా దూసుకొచ్చింది.ప్రయాణికులు కళ్లు మూసి తెరిచేలోపే పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి వచ్చేసింది.
దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా పరుగులు పెట్టారు.తమ ప్రాణాలకు కాపాడుకునేందుకు రెప్పపాటులో పక్కకు దూకేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది.మరో వైపు రైలులో ఉన్న ప్రయాణికులు కూడా కిందకు దూకేశారు.
ఈ హఠాత్పరిణామంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రైన్ నుంచి దూకేసిన లోకో పైలట్ గాయాలపాలయ్యాడు.
దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నామని రైల్వే అధికారులు చెప్పారు.
ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు.ఏదేమైనా ప్రమాదం సమయంలో తమకు గుండెలు జారిపోయాయని అక్కడి ప్రయాణికులు చెబుతున్నారు.
రెప్పపాటులో ట్రైన్ దూసుకొచ్చిందని, అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకున్నామని తమకు ఎదురైన భయంకర అనుభవాన్ని తలుచుకుంటున్నారు.







