ఇంగ్లీష్ ను మన మాతృభాష లాగా నేర్చుకుంటేనే ప్రావీణ్యం వస్తుందని అంతర్జాతీయ ఆంగ్ల నిపుణులు ఎస్ఎం అరుణ్ తెలిపారు.స్థానిక ఖమ్మం లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో శనివారం జరిగిన అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టు కాదని ఒక భాష అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు.నిరంతరం వినడం, మాట్లాడడం ద్వారానే ఇంగ్లీష్ వస్తుందని పేర్కొన్నారు.
మార్కుల కోసం చదవడం వలన ఎన్ని సంవత్సరాలైనా ఇంగ్లీష్ మాట్లాడడం రాదని ఆయన తెలిపారు.స్టడీ మెటీరియల్స్ చదవడం వలన ఆంగ్ల నైపుణ్యం రాదని ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలు చదవడం వలన ఎంతో ఆంగ్ల పరిజ్ఞానం లభిస్తుందని వివరించారు.
ఆంగ్ల నైపుణ్యం లేకపోవడం వలన వేలాది ప్రవేట్, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు నిరుద్యోగులకు రావడంలేదని అరుణ్ తెలియజేశారు.ఆంగ్లంలో నైపుణ్యం, మాట్లాడడం వచ్చిన వారికే కార్పొరేటు ఉద్యోగాలు సొంతం అవుతాయని పేర్కొన్నారు.
మన విద్యార్థులకు మార్కులు వస్తున్నాయి గాని ఉద్యోగాలు రాకపోవడానికి ఇంగ్లీష్ లో మాట్లాడు లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు.మాతృభాషను నేర్చుకున్న మాదిరిగా ఆంగ్లాన్ని నేర్చుకోవాలన్నారు.
చిన్నప్పటినుంచి మొదలుకొని ఇంజనీరింగ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పటికీ ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడం మన విద్యా వ్యవస్థ దురవస్థను తెలియజేస్తుందని ఆయన వివరించారు.నేతిబీరకాయలో నెయ్యి లేని విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న మన విద్యార్థి లోకానికి ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవడం వలన చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని, ఇప్పటికైనా విద్యార్థులు ఇంగ్లీష్ ను మాతృభాష లాగా నేర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ డైరెక్టర్ యం.సరళ, ఉపాధ్యాయులు షణ్ముగ, రజిని ప్రియా, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.