చాలా కాలంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు.ఆయన చేస్తున్న హడావుడి చూస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.2014లో టిఆర్ఎస్ విజయం సాధించింది.ఐదేళ్ల ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకపోయినా, 2018 లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ సక్సెస్ అయ్యారు.
రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ ప్రభుత్వమైనా ఐదేళ్లపాటు ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.అయితే కేసీఆర్ మాత్రం మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్టుగానే రాజకీయ పరిణామాలు చేసుకుంటూ ఉండడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల కమిషన్ తెలంగాణ విషయంలో చేస్తున్నహడావుడి మరింత ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలోని రాజకీయ పక్షాలతో సీఈవో వికాస్ రాజ్ సమావేశం కావడం, అనేక అంశాలపై చర్చించారు.ఓటరు జాబితాలో డబల్ ఫోటో ఎంట్రీ సవరణలపై వివిధ రాజకీయ పార్టీలతో ఆయన రెండు రోజుల క్రితం సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఓకే ఫోటోతో 2,3 ఓటర్ కార్డులు ఉన్నవి దాదాపు 22.04 లక్షలు ఉన్నట్లు ఆయన తెలిపారు.50 నియోజకవర్గాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల తో పాటు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 91,112 ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు.ఈ మేరకు జాబితాలో ఉన్న డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని వికాస్ రాజు స్పష్టం చేశారు.
దీని కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగంచి డూప్లికేట్ ఓట్ల ఏరివేత ప్రక్రియ చేపడుతున్నామని ఆయన తెలిపారు.

అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటి నుంచే ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం వంటివి చేస్తూ ఉండడం , ముందస్తు ఎన్నికల్లో భాగంగానే అనే అనుమానాలు కలుగుతున్నాయి .ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ కొనసాగిస్తారని అంతా అనుకున్నా, తెలంగాణలో ఇప్పటి నుంచే ఈ హడావుడి కనిపిస్తుండడంతో ముందస్తు ఎన్నికలు నిజమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రకటనలు చేస్తున్నారు .ఏక్షణమైనా ముందస్తు ఎన్నికలు రావచ్చని , పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి అంటూ ఇప్పటికే తెలంగాణలోని అన్ని పార్టీలు తమ పార్టీ నేతలను అలెర్ట్ చేస్తున్నాయి.








