అమెరికాలో భారత సంతతి పారిశ్రామికవేత్త ఉమాంగ్ గుప్తా కన్నుమూశారు.ఏప్రిల్ 19న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని శాన్‌మాటియోలోని తన స్వగృహంలో గుప్తా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.గత కొంతకాలంగా మూత్రాశాయ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్‌లో గుప్తా ప్రముఖ వ్యక్తి.1980, 90 దశకాలలో కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో కంపెనీలు స్థాపించి.తర్వాతి తరానికి మార్గదర్శిగా నిలిచారు.
తొలి తరం ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఉమాంగ్ గుప్తా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన చూపిన బాటలోనే అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ అసాధారణ విజయాలు సాధిస్తూ వస్తోంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (ఐఐటీ)ని అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మంచి బ్రాండ్‌గా మార్చడంలో గుప్తా కీలకపాత్ర పోషించారు.1971లో ఐఐటీ కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన ఉమాంగ్ గుప్తా.2002లో ఐఐటీ కాన్పూర్ ఫౌండేషన్ స్థాపించారు.ఐఐటీ పూర్వ విద్యార్ధుల నెట్‌వర్క్‌లలో ఒకటైన PanIITకి గ్లోబల్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధుల సంఘాన్ని కూడా ఉమాంగ్ గుప్తానే స్థాపించారు.1996లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూర్) నుంచి విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డును ఆయన అందుకున్నారు.ఐఐటీ కాన్పూర్ ఫౌండేషన్ కోసం ఉమాంగ్ గుప్తా నిధులు సేకరించారు.
1949లో పాటియాలలో జన్మించారు ఉమాంగ్ గుప్తా .తన తండ్రి ప్రభుత్వ అధికారి కావడంతో దేశంలోని అనేక నగరాల్లో పెరిగారు.ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు.
అభివృద్ధి చెందుతున్న కార్పోరేట్ ప్రపంచాన్ని అర్ధం చేసుకునేందుకు.ఒహియోలోని కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లారు.1973లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఐబీఎంలో కంప్యూటర్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా చేరారు.అనతికాలంలోనే సీనియర్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు.
అనంతరం మాగ్నూసన్ కంప్యూటర్స్‌లో ఏడాది పాటు పనిచేశారు.తర్వాత 1981లో రిలేషనల్ సాఫ్ట్‌వేర్ (ప్రస్తుతం ఒరాకిల్)లో చేరారు.
శాంటాక్లారా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ ఎదుగుదలలో ఉమాంగ్ గుప్తా కీలకపాత్ర పోషించారు.ఒరాకిల్ కార్పోరేషన్ తొలి వ్యాపార ప్రణాళికను రాసిన వ్యక్తిగా చరిత్రకెక్కారు.1984 వరకు మైక్రో కంప్యూటర్ ఉత్పత్తుల విభాగానికి వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

తర్వాత కాలంలో మదుపరిగా మారిన ఉమాంగ్ గుప్తా.వెబ్‌సైట్‌ల పనితీరును ట్రాక్ చేసే కీనోట్ సిస్టమ్స్‌లో పెట్టుబడి పెట్టారు.ఈ క్రమంలోనే ఆ కంపెనీ బోర్డు ఆయనను సీఈవోగా నియమించింది.1999లో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది.ఈ కంపెనీకి 2013 వరకు గుప్తా సీఈవోగా వ్యవహరించారు.
బ్రిటీష్ అమెరికన్ పౌరురాలు రూత్‌తో ప్రేమలో పడ్డ ఉమాంగ్ గుప్తా 1980లో ఆమెను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.1987లో వీరి కుమారుడు రాజీ మరణించడంతో అతని జ్ఞాపకార్థం PARCA అనే స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళాలు ఇచ్చారు.అంగవైకల్యం వున్న పిల్లల కోసం ‘రాజీ హౌస్’ని నెలకొల్పారు.
ఉమాంగ్ గుప్తా మరణం పట్ల అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.







