పదవులు అనేవి కొంచెం కాలమే ఉంటాయని, పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ అవే పదవులు శాశ్వతం కావని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పొంగులేటి మాట్లాడుతూ పదవులు శాశ్వతం అని ఎవరైనా అనుకుంటే అది పగటి కలలు కన్నట్లే అని వ్యాఖ్యానించారు.ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని, కానీ ప్రజల కోసం పాటు పడినవారే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు.
చనిపోయినా, పదవినుంచి దిగిపోయినా, ఏ పదవీ లేకున్నా ప్రజల మనసుల్లో స్థానం ఉన్నవాళ్లకే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు.ఏ పదవి లేకున్నా ప్రజల మధ్యకు వెళ్లే ప్రజల అభిమానం ప్రతి నాయకుడికి, ప్రజాప్రతినిధికి అవసరం అన్నారు.
స్వాతంత్రం వచ్చి ఐదు దశాబ్దాలు దాటినా, నేటికీ తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో పూరి గుడిసెల్లో పేదవాళ్ల ఉన్నమాట వాస్తవమే అని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం పని చేయాలని, అప్పుడు వారికి న్యాయం జరుగుతుందన్నారు.







