తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్ష పార్టీల నిరసనల హోరుతో వేడెక్కిన పరిస్థితి ఉంది.వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది.
అయితే తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఢిల్లీలో నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్న తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పై పడింది.అయితే కేంద్రం మాత్రం ఇతర రాష్ట్రాలలో అనుసరించే విధానాన్నే తెలంగాణలో అమలు చేస్తాం తప్ప తెలంగాణ కంటూ సరికొత్త విధానాన్ని అమలు చేయలేమని తెలంగాణలో పండించే ఉప్పుడు బియానికి విదేశాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నిల్వలే నిరుపయోగంగా ఉన్నాయని కావున పూర్తి స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు తీవ్ర అన్యాయం జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ ధర్నాతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు .బీజేపీ కూడా తగ్గేదేలే అన్న రీతిలో పోటాపోటీ ధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది.అయితే పోటాపోటీ ధర్నాలతో ప్రస్తుతం రాజకీయం వేడెక్కడమే కాకుండా రైతులలో పెద్ద ఎత్తున అనిశ్చితి నెలకొందని చెప్పవచ్చు.ఈ ధర్నాలతో ఈ వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారమవుతుందా లేక ఇంకా మరిన్ని రాజకీయ మలుపులు తీసుకుంటుందా అనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనా ఈ వరి ధాన్యం కొనుగోలుపై ఏ ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు ప్రకటన చేస్తుందన్నది ఇప్పుడు రైతులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.







