ప్రజలపై మరోసారి ఆర్టీసి ఛార్జీల భారం పెరగనున్నాయని , కొద్దిరోజుల క్రితం బస్సు ఛార్జీలు పెంచిన టిఎస్ఆర్టీసి మరోసారి డీజిల్ సెస్ పేరుతో టికెట్ ధరలు పెంచటం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ ఖండించారు .సామాన్య ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసిని దూరం చేయటం ప్రభుత్వ లక్ష్యంగా వున్నదని అన్నారు .
బడ్జెట్లో టిఎస్ఆర్టీసికి 2 % నిధులు కేటాయించాలని కార్మిక సంఘాల జెఎసి నేతలు కోరారని, ప్రభుత్వం వారి వినతిని పరిగణనలోనికి తీసుకోలేదని తెలిపారు .పెరిగిన డీజిల్ భారాలను ప్రభుత్వమే భరించాలని కోరారు .డీజిల్ విడి భాగాలతో సహా అన్ని రకాల ఆర్టీసి సేవలపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసుకుంటున్నాయని తెలిపారు .ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఆర్టీసికి ఇవ్వాల్సిన రీయంబర్స్మెంట్ , ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు చెల్లింపు కోసం నామమాత్రంగా కేటాయించడం వలన ఆర్టీసి తీవ్ర నష్టాల్లోకి వెళ్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలను మరోసారి పెంచటం దారుణం అని అన్నారు .20 రోజుల వ్యవధిలో పల్లెవెలుగు ఆర్డినరీ బస్సుల్లో 6 రూ.లు , ఇతర సర్వీసుల్లో 8 నుంచి 10 రుపాయల వరకు టిక్కెట్ ఛార్జీలు పెంచటం జరిగిందని అన్నారు .ఇది ప్రజా రవాణ అయిన ఆర్టీసీపై ఆధారపడి ఉన్న పేద , మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమే అవుతుందన్నారు .డీజిల్ సెస్ పేరుతో పల్లెవెలుగు ఆర్డినరీ బస్సుల్లో అదనంగా 2 రూ.లు , ఎక్స్ప్రెస్ , డీలక్స్ బస్సుల్లో 5 రూ.ల చొప్పున డీజిల్ సెస్ పేరుతో పెంచటం జరిగిందన్నారు .కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా పెట్రోల్ , డీజిల్పైన సెస్సుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .ప్రజలపైన భారంగా పెంచిన ఆర్టీసి ఛార్జీలను వెంటనే ప్రభుత్వం సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .