ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు,శనివారం ఖమ్మం నియోజకవర్గంలోని పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.ప్రజలు, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసి పాఠశాలలను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టాలని, అందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ అధికంగా నిధులు కేటాయిస్తున్నదని గుర్తు చేశారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియంలో చదివించే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు.’మన ఊరు-మన బడి’ ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఈ కార్యక్రమం కింద పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, ఫర్నిచర్, పెయింటింగ్, గ్రీన్‌చార్ట్ బోర్డులు, కాంఫౌండ్ వాల్స్, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాసులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలవుతుందన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.7,289 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టిందని వివరించారు.తొలి విడుత 9,123పాఠశాల్లో 12 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.3,497 కోట్ల ఖర్చు చేస్తున్నామని చెప్పారు.ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా 426 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 326 పాఠశాలల్లో 44,741 మంది, పట్టణ ప్రాంతాల్లో 62 పాఠశాలల్లో 14,044 మంది మొత్తం 58,785 మంది విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు







