సొంత పార్టీ వాళ్లే అవమానించారంటూ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బోరున విలపించింది.వివరాల్లోకి వెళితే.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రామాపురం వరకు నల్లజెండాలతో ద్విచక్ర వాహనాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనం వెనకవైపు కూర్చున్న మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మిని వెనుక బండిపై ఉన్న కౌన్సిలర్ భర్త ఆకతాయిలా వ్యవహరిస్తూ చైర్ పర్సన్ ప్రయాణిస్తున్న బండిని తాకారు.
గమనించిన చైర్ పర్సన్ సీతాలక్ష్మి ‘అన్నా కాస్త చూసి నడపండి బండి నాకు తాకుతుంది అని చెప్పానని, మాట వినిపించుకోకుండా మూడు సార్లు అదేపనిగా బండితో మళ్లీ మళ్లీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా కిందపడిపోయినట్లు ఆమె తెలిపారు.దండం పెడతా అన్నా అని ప్రాధేయపడ్డా వినిపించుకోలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
కౌన్సిలర్ భర్త ఇలా చేయడం సమంజసం కాదని కాసేపు రోడ్డుపై బైఠాయించారు.అనంతరం విషయం తెలుసుకొని ఇంటికి వచ్చిన ప్రజాప్రతినిధులతో బోరున విలపించింది.
ప్రజా ప్రతినిధులు అయ్యుండి ఆడవారితో ఆకతాయిల్లా ప్రవర్తించడం ఎంత మాత్రం సమంజసం కాదని, తక్షణమే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును వేడుకుంది.