సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో దేవాలయ భూముల వేలం సందర్భంగా టీఆర్ఎస్,కాంగ్రేస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొనడంతో రాజకీయ మంటలు భగ్గుమన్నాయి.ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
దీనితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సోమవారం గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ భూములను బహిరంగ వేలం వేస్తున్నారు.
ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్,ప్రతిపక్ష కాంగ్రేస్ వర్గీయులకు మధ్య వివాదం తలెత్తినది.ఆ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారినట్లు దాడులు చేసుకొనే వరకు వెళ్ళింది.
ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి.పోలిసుల సాక్షిగా టీఆర్ఎస్ వర్గీయులు తమపై దాడి చేశారని గాయపడిన కాంగ్రేస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
దాడిలో గాయపడిన కాంగ్రేస్ నాయకులు మెంచు చక్రయ్య,గునగంటి వెంకన్న,కన్నారావు,దశరథలను చికిత్స కోసం సూర్యాపేటకు తరలించారు.