ఏపీలో కొత్త జిల్లాల పేరిట భౌగోళికంగా మార్పులు జరుగుతున్నాయా ?సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేస్తున్నదా ? ప్రజలకు పాలనా యంత్రాంగం అందుబాటు లోకి రానుందా ? అంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి.ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి.
ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం .
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది.ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య 13 కొత్త జిల్లాల కార్యకలాపాలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.కలెక్టర్‌తోపాటు జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలని, క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి.వాటిని పరిశీలించి చర్చించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే కలెక్టర్లు సిఫార్సులు చేశారు. సిబ్బంది విభజన, పోస్టింగుల్లో ఆరు సూత్రాల ఫార్ములా తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేశారు.
కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరి చూసుకునేందుకు చెక్‌లిస్టు కూడా రూపొందించారు.
నూతన వెబ్‌సైట్లు, యంత్రాంగానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు పూర్తయ్యాయి.
కొత్త జిల్లాల సమాచారంతో హ్యాండ్ బుక్స్ కూడా సిద్ధం చేశారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారు చేశారు.
ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట్ల ప్రైవేట్ భవనాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు, కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన మార్పులు చేర్పులకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఏప్రిల్ 3వ తేదీన తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.అదే రోజు కొత్త జిల్లాలకు కలెక్టర్లను, జేసీలను, ఎస్పీలను, ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
జిల్లాల పునర్విభజనకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 7న కమిటీ ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ స్థానం ఒక్కొ జిల్లాగా చేయాలని అనుకున్నా…రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్ధానాలుండగా …పాడేరు ఏజెన్సీ ప్రాంతం పెద్దదిగా ఉండటంతో రెండు జిల్లాలుగా విభజించారు.దీంతో మొత్తం 26 జిల్లాలయ్యాయి.
కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక విస్తీర్ణం, జనాభా తదితర పరిస్ధితులని పరిగణనలోకి తీసుకున్నారు .పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రం దగ్గరగా ఉండటం, పరిపాలనా సౌలభ్యం, ఆర్ధిక వసతులు, పరిస్ధితులు, వనరులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు .ప్రతీ జిల్లాలో రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్ లో ఉండేలా చూశారు .అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించకుండా అదే జిల్లాలో ఉండేలా చూసారు.

కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలకు ఒక్కో కలెక్టర్, ఒక్కో జాయింట్ కలెక్టర్, ఒక్కో ఎస్పీని నియమించనున్నారు.ఇప్పటికే 13 జిల్లాల్లో ఆసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్త జిల్లాలకు జిల్లా రెవెన్యూ అధికారులుగా నియమిస్తారు.ఈ నెల 4న కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు ఆ జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల్లో ఉద్యోగులు బాధ్యత చేపడతారు.
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పనిచేయాల్సిన ఉద్యోగులు, అధికారుల పంపిణీ కసరత్తును ఇప్పటికే సంబంధిత శాఖలతోపాటు ఆర్థిక శాఖ కూడా పూర్తి చేసింది.
ప్రస్తుత జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులనే జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాల్లో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన బదిలీ చేయనున్నారు.ఆరు సూత్రాలు, జోన్‌లకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతులు, సీనియారిటీ, స్థానికతలో ఎటువంటి మార్పు ఉండదు.
ప్రస్తుతం ఉన్న సీనియారిటీ, స్థానికత యథాతథంగా ఉంటుంది.మొత్తంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య 10వేల నుంచి 12వేల లోపు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.







